ఉద్రిక్తంగా బిఆర్‌టిఎస్‌ రోడ్డు

Jan 23,2024 08:08 #Anganwadi strike
  •  అడ్డంకులు అధిగమించి నిరసన తెలిపిన అంగన్‌వాడీలు
  • బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలింపు
  • మద్దతు తెలపడానికి వచ్చిన మధు, నరసింగరావు తదితరుల అరెస్ట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జిల్లాల్లో పోలీసులు సృష్టించిన అడ్డంకులను అధిగమించి బిఆర్‌టిఎస్‌ రోడ్డుకు చేరుకున్న వేలాదిమంది అంగన్‌వాడీలపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. బిఆర్‌టిఎస్‌ రోడ్డుపై చైతన్య స్కూల్‌, సిఐటియు కార్యాలయం వద్దకు అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు పెద్దసంఖ్యలో వారిని అక్కడ నుండి తొలగించేందుకు బలప్రయోగం చేశారు. మగ పోలీసులే వారిని లాక్కెళ్లి వాహనాల్లోకి తోసేశారు. ఈ సందర్భంగా పలువురు మగ పోలీసులు దురుసుగా, ప్రవర్తించడం కనిపించింది. పోలీసులు లాక్కెల్లే సమయంలో అంగన్‌వాడీల గాజులు పగిలిపోతున్నాయని చెప్పినా వినకుండా వ్యవహరించారు. చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా వాహనాలను ఎక్కించడంతో బిఆర్‌టిఎస్‌ రోడ్డు వెంట చాలా మంది చెప్పులు పడిపోయాయి. మహిళలపై పోలీసుల దాష్టికాన్ని ఖండిస్తూ సిపిఎం సీనియర్‌ నాయకులు పి మధు వారికి సంఘీభావం తెలిపేందుకు రాగా పోలీసులు ఆయన్ను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లి బస్సులో వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే అంగన్‌వాడీ ఆందోళనకు మద్దతుగా వచ్చిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, అజరుకుమార్‌, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, నాయకులు రవిచంద్రను దౌర్జన్యంగా బస్సులోకి ఎక్కించి బస్సులోనే గంటల తరబడి తిప్పారు. బిఆర్‌టిఎస్‌ రోడ్డులోకి వచ్చిన అంగన్‌వాడీలను దగ్గరలో వుంచితే తిరిగి సాయంత్రంలోపు ఆందోళనలను చేపట్టే అవకాశం వుందని బస్సుల్లో మచిలీపట్నం, భీమవరం, ఏలూరు, నర్సారావుపేట, సత్తెనపల్లి వంటి పట్టణాలకు తరలించారు. బిఆర్‌టిఎస్‌ రోడ్డంతా పోలీసుల తీరుతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ ఉద్రిక్తంగా మారింది.

➡️