తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుతల సంచారం

Mar 29,2024 13:12 #again, #Cheetah, #Tirumala walkway

తిరుపతి : తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుతల సంచారం కలకలం రేపింది. గతంలో చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం, మరో చిన్నారిని బలిగొన్న సంగతి విదితమే. చిరుతలతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్‌ అధికారులతో కలిసి టిటిడి చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి కదలికలను గుర్తించి బోన్‌లను ఏర్పాటు చేస్తూ.. వాటిని బంధిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ చిరుతల సంచారం టిటిడిలోనూ, భక్తుల్లోనూ ఆందోళన కలిగించింది.

శుక్రవారం తిరుమలలో డీఎఫ్‌వో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ … నడకదారిలో చిరుతల సంచారం కొనసాగుతుందన్నారు. గత ఫిబ్రవరి నెలలో చిరుతల కదలికలు కనిపించలేదని, కానీ, మార్చి నెలలో ఐదు సార్లు చిరుత కనిపించినట్టు వెల్లడించారు. అధునాతనమైన ట్రాప్‌ కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గుర్తించి, సిబ్బందిని అప్రమత్తం చేశారని తెలిపారు. ఇక, ఏప్రిల్‌ నెలలో సెంట్రల్‌ వైల్డ్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతామన్నారు. వారి సూచనలతో నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

➡️