ఉల్లంఘనలపై సిఐడి నోటీసులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘల కింద తెలుగుదేశం పార్టీకి సిఐడి నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై దుష్ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ అంశంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని వైసిపి చేసిన ఫిర్యాదుపై ఇసి స్పందించి సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో సిఐడి ఇన్‌స్పెక్టరు తిరుమలరావు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి ఆదివారం నాడు వెళ్లి భూ యాజమాన్య హక్కు చట్టంపై మీ వద్ద వున్న సాక్ష్యాధారాలను తీసుకుని సోమవారం గుంటూరులోని సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు అందజేశారు. అలాగే ఇంటింటికీ పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారని వైసిపి సోషల్‌ మీడియా దుష్ప్రచారం చేస్తోందని టిడిపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించింది. వైసిపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని సిఐడిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

➡️