దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి : సినీ నటుడు బాలకృష్ణ

May 2,2024 23:30 #2024 election, #Balakrishna

ప్రజాశక్తి-చీపురుపల్లి/విజయనగరం కోట : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విజయనగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాలనూ జగన్‌ అధోగతి పాల్జేశారని విమర్శించారు. మడం తిప్పనన్న ఆయన మెడలు తిప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 20 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇంత వరకు భర్తీ చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు నామమాత్రపు పోస్టులతో డిఎస్‌సి విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 12,383 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని, వారు ఏ విధంగా విద్యార్థులకు పాఠాలు చెప్పగలరని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు రంగులు వేసి మేడి పండులా చూపిస్తున్నారే తప్ప అక్కడ విద్యార్థులకు ఎటువంటి విద్య అందడంలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని, ఆర్‌టిసి ఛార్జీలు ఐదుసార్లు పెరిగాయని అన్నారు. టిడిపి అమలు చేయబోయే సూపర్‌ సిక్స్‌తోపాటు మెగా మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు శ్రమించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయా సభల్లో కూటమి ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి కళా వెంకటరావు, పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు.

➡️