వేలంపాటల్లో ఘర్షణ.. కత్తులతో దాడి

Mar 18,2024 21:25 #Hatya, #Kurnool
  • యువకుడు మృతి

ప్రజాశక్తి – చాగలమర్రి (నంద్యాల) : వేలంపాటలో ఘర్షణ చోటు చేసుకొని కత్తి పోటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా చాగలమరి పట్టణ మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగలమర్రిలోని 3వ సచివాలయంలో ఇఒ నాగమణి ఆధ్వర్యంలో బస్టాండు, దినసరి సంత మార్కెట్‌, కబేళా తదితర వాటికి బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. ముల్లా జహంగీర్‌, ముల్లా నాయబ్‌ రసూల్‌, ముల్లా ఆలంశగారి రసూల్‌, ముల్లా అబ్దుల్‌ ఖాదర్‌లు రూ. 80 వేలు డిపాజిట్లు కట్టి వేలంపాటలో పాల్గొన్నారు. డిపాజిట్లు కట్టిన వాళ్లు మాత్రమే వేలంపాట వద్ద ఉండాలనే విషయంలో రసూల్‌, ఖాదర్‌ మధ్య వాగ్వివాదం మొదలైంది. దీంతో అధికారులు వేలంపాటలను వాయిదా వేశారు. అక్కడ నుంచి వస్తూ ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో రసూల్‌, ఖాదర్‌ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఖాదర్‌ కుమారుడు దస్తగిరి కత్తితో రసూల్‌ కుమారుడు ఇమాం (30) గొంతుపై పొడిచి దాడి చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమణయ్య ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇమామ్‌ను పోలీసు వాహనంలో స్థానిక కేరళ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. ఆళ్లగడ్డ డిఎస్‌పి షర్పుద్దీన్‌, రూరల్‌ సిఐ హనుమంత నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఇమామ్‌ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు.

➡️