‘వెలుగొండ’ నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ

జూన్‌ లేదా జులైలో ఇస్తాం

-వచ్చే సీజన్లో నీటి విడుదల

-కరువు ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు వరం : ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి- పెద్దదోర్నాల, మార్కాపురం (ప్రకాశం జిల్లా):వెలుగొండ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వారికి అవసరమైన రూ.1,200 కోట్ల ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని వచ్చే జూన్‌ లేదా జులైలో అందిస్తామన్నారు. అదే సీజన్‌లో నీటిని వెలుగొండకు విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కరువు ప్రాంత ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు వరమని, కరువు పీడిత ప్రాంతం సస్యశ్యామలం కానుందని అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సొరంగ మార్గాల వద్ద ఏర్పాటు చేసిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పైలాన్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టు సొరంగ మార్గంలో కొంతదూరం పయనించారు. ఆ తర్వాత జరిగిన సభలో జగన్‌ మాట్లాడుతూ కీర్తిశేషులు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారని, అప్పట్లోనే అధిక శాతం పనులు జరిగాయని తెలిపారు. తన తండ్రి చేపట్టిన ప్రాజెక్టును తనయుడిగా తాను ప్రారంభించడం తన అదృష్టమన్నారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఐదు, కడప జిల్లాలో రెండు మండలాలు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 820 అడుగుల్లో మాత్రమే నీరు ఉందని, 840 అడుగులకు చేరాక వెలుగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందనుందని వివరించారు.

శ్రద్ధ చూపని చంద్రబాబు

వెలుగొండ ప్రాజెక్టుపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రమూ శ్రద్ధ చూపలేదని, సొరంగాలను పూర్తి చేయడంలో విఫలమయ్యారని జగన్‌ విమర్శించారు. మొదటి, రెండవ సొరంగాలు కలిపి 37.6 కిలోమీటర్లు ఉంటాయన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో 20 కిలోమీటర్లు పని జరిగిందని, చంద్రబాబు కాలంలో జరిగిన పని కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమేనని వివరించారు. మిగిలిన 11 కిలోమీటర్ల మేర సొరంగాల తవ్వకాలను తాము పూర్తి చేశామని, మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13న, రెండవ సొరంగం పనులు గత నెలలో పూర్తయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి.సుబ్బారెడ్డి, మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎపిఐఐసి చైర్మన్‌ జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️