సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన యువకుడిపై దాడి

Mar 24,2024 20:28 #ntr district

ప్రజాశక్తి – వీరులపాడు (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన యువకుడిపై వైసిపి నాయకులు ఆదివారం దాడి చేశారు. మండలంలోని వైసిపి కార్యాలయానికి రంగులు తొలగించకపోవడంతో మండల పరిధిలోని జుజ్జూరు గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌ బాషా సి విజిల్‌ యాప్‌లో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. స్పందించిన సంబంధిత అధికారులు ఆ కార్యాలయానికి ఉన్న రంగులు తొలగించి, సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో వైసిపి నాయకులు బాషాపై దాడికి దిగారు. దీంతో వీరులపాడు పోలీస్‌ స్టేషన్‌లో బాషా ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో యువకులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ఎస్‌ఐ మహాలక్ష్ముడు ఇద్దరి జామిన్‌తో అదుపులో తీసుకున్న వ్యక్తులకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు.

➡️