మోడీ మత దురహంకార విధానాన్ని ఖండించండి  

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : ప్రధాని మోడీ మత దురహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి బిజెపి ప్రభుత్వం సిఏఏ వంటి నిరంకుశ చట్టాన్ని చేయటాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీలు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్ లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఒంగోలు కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు ముస్లిం మైనారిటీలకు హాని కలిగించే సీఏ ఏ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో అనేక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. సిఏఏ చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే కాదని దేశంలోని ఇతర మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రమాదకరమైందన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష టిడిపి సీఏఏకి అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ముస్లింల హక్కులు కాపాడుతామని హామీలు గుప్పిస్తున్నారన్నారు. టిడిపి వైసిపి వారి విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్త పార్లమెంట్లో ఇండియా కూటమి సీఏఏకు వ్యతిరేకంగా బిల్లు పెడుతుందని వైసిపి, టిడిపి వారి వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ డి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు ఎస్ లలిత కుమారి, ముస్లిం సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

➡️