రైతులపై దాడిని ఖండించండి 

Condemn the attack on farmers
  • నేటి గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలి 
  • ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు చలో ఢిల్లీకి బయలుదేరిన రైతులపై బిజెపి ప్రభుత్వం అమానవీయ పద్ధతిలో దాడులు చేస్తోందని, ఈ అమానవీయ దాడులను తీవ్రంగా ఖండించాలని ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రైతు, కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరింది. ఈ మేరకు గురువారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, రైతు సంఘం నాయకులు పి జమలయ్య, జి ఈశ్వరయ్య, డి హరినాథ్‌, వెంకటరెడ్డి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేశారని స్వామినాథన్‌కు భారతరత్న అవార్డును ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని కోరిన రైతులపై దాడులకు తెగబడుతోందని విమ ర్శించారు. రైతులపై టియర్‌ గ్యాస్‌, చెవులు దెబ్బతినేలా శబ్దాలు, వాటర్‌ గన్‌లు, రోడ్లపై మేకులు, గుంతలు తవ్వడం వంటి అడ్డంకులు సృష్టించడంతోపాటు లాఠీఛార్జ్‌ చేస్తూ రైతులను తీవ్రంగా గాయపరుస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై సాగిస్తున్న దాడులను స్వామినాథన్‌ కూతురు కూడా ఖండించినట్లు తెలిపారు. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని, కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, రుణ విమోచన కల్పించాలని, విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేయాలనే డిమాండ్‌లతో పాటు కార్మిక హక్కులను కాలరాసి కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని శుక్రవారం చేపట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను రైతులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️