వైసిపి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ గాలం?

Dec 28,2023 08:17 #Andhra Pradesh, #Congress, #ys sharmila
congress coordination committee meeting

త్వరలో షర్మిలతో పాటు పలువురి చేరిక

సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : టిక్కెట్లు నిరాకరించడంతో అసంతృప్తిలో ఉన్న వైసిపి ఎంఎల్‌ఏలకు కాంగ్రెస్‌ పార్టీ గాలం వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో గెలుపుతో జోష్‌ మీద ఉన్న ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అసంతృప్త ఎంఎల్‌ఏలతో కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఏపి కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలా కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పెద్దలు ఈ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. ఆమెకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని సమాచారం. అయితే, షర్మిల మాత్రం తొలుత ఎఐసిసిలో సర్ధుబాటు చేయాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. షర్మిల భర్త అనిల్‌కుమార్‌ ఇప్పటికే ఢిల్లీలో ఉండగా షర్మిలా కూడా నేడో, రేపో దేశ రాజధానికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం, ఎఐసిసి నుండి కొద్దిరోజులు రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షించి, ఆ తరువాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరిం చాలని షర్మిల భావిస్తుండగా, సమయం ఎక్కువ లేనందువల్ల వెంటనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం కోరుతున్నట్లు తెలిసింది. మరోవైపు వైసిపిని వీడనున్న ఎంఎల్‌ఏల గురించి ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు గతంలో తమతో సన్నిహితంగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. కడప నుండి లోక్‌సభ ఎన్నికల బరిలో షర్మిలను దింపాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ అనుకూల ఫలితం రాకపోతే కర్నాటక నుండి రాజ్యసభకు పంపుతారని భావిస్తున్నారు.

  • కాంగ్రెస్‌ను పునర్‌నిర్మిస్తాం : మాణిక్‌ఠాగూర్‌

ఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం ఏపి ఇన్‌ఛార్జ్‌ మణిక్యం ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ రానున్న లోకసభ ఎన్నికలపై చర్చించామని తెలిపారు. పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఏపిలో కాంగ్రెస్‌ను పునర్నిర్మిస్తామని, కాంగ్రెస్‌ సిద్దాంతం నమ్మే వారికి స్వాగతమని అన్నారు. రాబోయే ఏపి అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలలో ఓటు శాతం పెంచుకునేదుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌పై చర్చ జరిపామని, తమ పార్టీలోకి తిరిగి వచ్చే వారికి ఆహ్వానమని అన్నారు. జనవరిలో రాష్ట్రంలో మూడు సభలు ఏర్పాటు చేస్తామని, అందులో పాల్గొనేలా మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించామని తెలిపారు. హిందుపురంలో ఖర్గే, విశాఖలో రాహుల్‌ గాంధీ, అమరావతిలో ప్రియాంక గాంధీ సభలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, కేసి వేణుగోపాల్‌, పిసిసి అధ్యక్షుడు గిడిగు రుద్రరాజు, సిడబ్ల్యుసి సభ్యుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి పళ్ళం రాజు, నేతలు చింతా మోహన్‌, కొప్పుల రాజు, హర్ష కుమార్‌, తులసి రెడ్డి, సుంకర పద్మ శ్రీ, మస్తాన్‌ వలి, మధు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. సభలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు.

➡️