సిపిఎంకు విరాళాలిచ్చి తోడ్పడండి!

Jan 31,2024 21:41 #CPM AP, #cpm v srinivasarao, #Donation
cpm calls to peoples fund for fight

– ప్రజా ఉద్యమాలను బలపర్చండి

– ‘ప్రజా నిధి’ కోసం ప్రజలకు విజ్ఞప్తి

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు పోటీపడి ఓటర్లకు డబ్బు ఎరవేస్తున్న సమయంలో సిపిఎం ప్రజల నుండే నిధి వసూళ్లకు పూనుకోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇదే సిపిఎంకు ఇతర పార్టీలకు ఉన్న తేడా. సిపిఎంకు స్వార్థపూరిత అజెండా లేదు. ప్రజల అభ్యుదయమే పార్టీ ఎజెండా. ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఎం కార్పొరేట్‌ నిధులు, ఎన్నికల బాండ్లు తీసుకోదు. ప్రజల నుండి నిధి వసూలు చేసే పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. అదే సిపిఎం ప్రత్యేకత. ఇది ప్రజల పార్టీ. ఈ పార్టీని నడిపించాల్సింది, ఆదరించాల్సింది సామాన్య ప్రజలే. అందుకే సిపిఎం విరాళాల కోసం మీ ముందుకు వస్తోంది. మన కష్టాల్లో పాలు పంచుకునే పార్టీకి మన కష్టార్జితంలో ఒక చిన్న మొత్తాన్ని విరాళంగా ఇస్తే అదే కొండంత శక్తిగా మారుతుంది. సామాజిక మార్పుకు బాటలు వేస్తుంది. నిత్యం సామాన్య ప్రజల బాగు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం నిజాయతీగా, నిస్వార్ధంగా పాటుపడుతున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు). ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆనాడు వేసిన బాటలో ముందుకు సాగుతూ సమాజంలో పేదరికం పోయి, కష్టజీవి సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని అనునిత్యం కృషి చేస్తోంది. నిత్యం పెరుగుతున్న ధరలతో, తరుగుతున్న ఆదాయాలతో, నిరుద్యోగంతో సామాన్యులు సతమతమవుతున్నారు. జనాభాలో ఒక శాతంగా ఉన్న బడా కార్పొరేట్‌ బాబులు తప్ప తక్కిన 99 శాతం ప్రజలు రకరకాల ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కరెంట్‌షాక్‌తో వ్యాపారాలు, పరిశ్రమలూ మూతపడుతున్నాయి. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుపోయి వుంది. వైద్యం, విద్య ఖరీదైన సరుకులయ్యాయి. విద్యుత్తు ఛార్జీలు తడిసి మోపెడయ్యాయి. దళితులు, గిరిజనులు, మహిళలు మైనారిటీలు, ఇతర బలహీన వర్గాలు నిర్లక్ష్యానికి, అవమానాలకు, అత్యాచారాలకు, దాడులకు గురవుతూనే వున్నారు. రాష్ట్రాన్ని విభజించిన తరువాత మనకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసినా, కేంద్రాన్ని ఆ విషయంలో నిలదీయడానికి రాష్ట్రంలో పెద్ద పార్టీలు ముందుకు రాని సమయంలో ప్రత్యేకహోదా కోసం సిపిఎం ఇతర శక్తులతో కలిసి పోరాడుతోంది. అసమానతలు లేని అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సామాజిక మార్పు కోసం ఈ ఏడాదిలోనే ఎన్నో ఉద్యమాలను నడిపింది. విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం నిర్వాసితుల పునరావాసం, అమరావతి రాజధాని నిర్మాణం, నిరుద్యోగం, కరువు సమస్య, ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. శ్రామిక ప్రజల ఆందోళనలకు చురుగ్గా మద్దతునిస్తోంది. రైతుల గిట్టుబాటు ధరలు, కూలీల ఉపాధి, అసైన్డ్‌ భూముల రక్షణ కోసం సమరశీలంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంది. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై గళమెత్తుతోంది. మధ్యతరగతి ప్రజలకు బాసటగా నిలబడుతోంది. ప్రపంచ దిగ్గజ వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్‌ వ్యాపారాల పోటీకి తట్టుకోలేని రిటైల్‌ వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. వాటి పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ముందుకు తెచ్చింది సిసిఎం. మతవిద్వేష రాజకీయాలతో సమాజంలో వాతావరణాన్ని విషపూరితంగా మార్చడానికి జరుగుతున్న కుట్రలను నిలువరించి ప్రజల మధ్య మతసామరస్యాన్ని, ఐక్యతను కాపాడుకోడానికి జాగరూకుల్ని చేస్తోంది. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఇతోధికంగా సేవ చేయడంలో సిపిఎం ఎప్పుడూ ముందే ఉంది. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో పలుచోట్ల వైద్య క్యాంపులను నడిపింది. వరదల్లో సహాయపడింది. దళితుల, ఆదివాసీల ఇతర పేదల భూములను కబ్జా చేసే బడా నేతల ఆగడాలను ప్రతిఘటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది. తమ పెత్తనాన్ని కాపాడుకుంటూ, కోటానుకోట్లు పోగేసుకోడానికి అండగా నిలిచే పార్టీలకు శత కోటీశ్వరులు, బడా కార్పొరేట్లు అండగా ఉంటారు. అందుకు భిన్నంగా సామాన్య ప్రజలకోసం, పేదలకోసం అనునిత్యం ఉద్యమించే సిపిఎంకు అండగా, వెన్నుదన్నుగా నిలిచి భుజం తట్టి ప్రోత్సహించవలసింది ప్రజలే. ప్రజలపై విశ్వాసంతోనే సిపిఎం నిలబడి పోరాడుతుంది. అందుకే మీ ముందుకు వస్తున్నాం. 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 10 వరకు రాష్ట్ర వ్యాపితంగా ప్రజల వద్దకు వెళ్లి పార్టీ ప్రజా ఉద్యమాల నిర్వహణ నిధి వసూళ్లు చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆర్థికంగా మీ శక్తిమేరకు తోడ్పడాలని కోరుతున్నాం. ప్రజానిధి కోసం పార్టీ యావత్తు కదలాలి. ప్రతి పార్టీ సభ్యుడు, ప్రతి శాఖ ఇంటింటికీ తిరిగి విరాళాలు వసూలు చేయాలి. పార్టీ సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు సహకరించాలని కోరుతున్నాం.

ప్రజలకోసం సిపిఐ(ఎం) ! సిపిఐ(ఎం)కు అండగా ప్రజలు !

➡️