సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ను గెలిపించండి : రమాదేవి

Apr 17,2024 12:55

ప్రజాశక్తి-నెల్లూరు
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి, దానికి అంటగాగుతున్న ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులైన టిడిపి, బిజెపి, జనసేన, పరోక్షంగా మద్దతిస్తున్న వైసిపి అభ్యర్థులను ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి పిలుపునిచ్చారు. నెల్లూరు నగర అసెంబ్లీ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్‌ తన ఎన్నికల ప్రచారాన్ని 52వ డివిజన్‌ పరిధిలోని రంగనాయకుల పేట ప్రాంతంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డి.రమాదేవి మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద దాడులు మరింతగా పెరిగిపోతున్నాయన్నారు. మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వ పాలన ఉపాధి రహితంగా సాగుతోందన్నారు. వైసిపి కూడా బిజెపికి తొత్తుగానే పనిచేస్తుందన్నారు. సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడతారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఇండియా వేదిక పార్టీలను గెలిపించాలని రమాదేవి పిలుపునిచ్చారు. దేశంలో ముస్లింలు లేకుండా తరిమేయాలనే కుట్రలు బిజెపి పాలకులు చేస్తున్నారని విమర్శించారు. కనీసం మౌళిక సదుపాయాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని రంగనాయకులపేట ప్రాంతంలోని ముస్లింములు సిపిఎం బృందానికి వివరించారు. ఈ ప్రాంతానికి కనీసం మంచినీటి సరఫరా కూడా సరిగా అందటం లేదని వారు వాపోయారు. డ్రెయినేజీ సమస్యలను అనునిత్యం ఎదుర్కొంటున్నామని వివరించారు. నిరంతరం పేదలు, కార్మికులు, రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ను గెలిపించాలని రమాదేవి కోరారు. సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌, సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, టి.శివకుమారి, ఎం.పుల్లయ్య, ఆలూరు తిరుపాలు, బి.పి నరసింహ, ఎం.వి.రమణ, స్థానిక సిపిఎం శాఖ సభ్యులు, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గన్నారు.

➡️