వాడవాడలా సిపిఎం ప్రచారం

  • రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల ముందుకు

ప్రజాశకి-యంత్రాంగం : ఎన్నికల సమయం దగ్గపడుతుండడంతో సిపిఎం అభ్యర్థులు ఇంటింటికి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కొద్దిసేపు గడిపారు. పలు దుకాణాలు, బడ్డీకొట్లు, తోపుడు బండ్ల వారి వద్దకు వెళ్లి ముచ్చటించారు. వ్యాపారులతో మాట్లాడారు. అందరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పేదలు, కార్మికులు, కష్ట జీవుల కోసం నిరంతరం పోరాడే సిపిఎం పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించి చట్టసభల్లోకి పంపించాలని కోరారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం భీంపోలు, గుమ్మకోట, గరుగుబిల్లిల్లో శుక్రవారం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, ఉపాధి, వైద్యం, తాగునీరు వంటి ప్రధాన అంశాలపై కేంద్రీకరించి పని చేస్తానని తెలిపారు. సిపిఎం గెలుపు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అరకు వారపుసంతలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం ప్రచారం చేపట్టారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స, కాంగ్రెస్‌ అరకు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టి గంగాధరస్వామిని గెలిపించాలని కోరారు.

రంపచోడవరంలోని టీచర్స్‌ కాలనీ, సీతంశెట్టి నగర్‌, ఎస్‌టి కాలనీ, మెయిన్‌ రోడ్డు, రెడ్డి పేట, గంగాలమ్మ వీధి, బందులు దొడ్డి వీధి, గొట్టాలరేవు తదితర ప్రాంతాల్లో నియోజకవర్గ అభ్యర్థి లోతా రామారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గిరిజనులకు అడవులపై హక్కును కోల్పోయేలా చేసిన బిజెపిని, దానికి మద్దతిస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.అరుణ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సిపిఎంను గెలిపిస్తే రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. విశాఖ 73వ వార్డులో సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు, కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. వార్డు పరిధిలోని సింహగిరి కాలనీ, పైడిమాంబ కాలనీ, సనత్‌నగర్‌, గొంతివానిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తే నాయకులను చట్టసభలకు పంపాలని కోరారు.

కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్‌ 34వ వార్డులోని శివయ్య నగర్‌, సంపత్‌ నగర్‌, కృష్ణారెడ్డి నగర్‌, గోపి నగర్‌, నిర్మల నగర్‌, బృందావన్‌ నగర్‌లలో సిపిఎం అభ్యర్థి డి.గౌస్‌ దేశారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, తాగునీరు అందించే విషయంలో పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందన్నారు. తనను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడతానని తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని రాజీవ్‌ గృహకల్ప, టిప్పర్ల బజార్‌, నిడమర్రు రోడ్డు, పార్క్‌ రోడ్డు, గౌతమ్‌ బుద్ధ రోడ్‌, భగత్‌ సింగ్‌ నగర్‌ ప్రాంతాల్లో నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివశంకరరావు ప్రచారం నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రైతులు, అనేక సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలను చెప్పి తమను బలపర్చాలని కోరారు.

నెల్లూరు 47వ డివిజన్‌ పరిధిలోని కుక్కలగుంట, కామాటి వీధి, రాజేంద్రనగర్‌, మసీద్‌ సెంటర్‌, కోటమిట్ట సెంటర్‌, గరిస వీధి సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్‌ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో తాగునీటి సమ స్యను పరిష్కరిస్తానని, డంపింగ్‌ యార్డును తొలగిస్తానని, చిల్డ్రన్స్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
విజయవాడ 26వ డివిజన్‌లోని మాచవరం, మారుతీనగర్‌, కాలవకట్ట ప్రాంతాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ బిజెపి, వైసిపి, టిడిపి విధానాలతో భవిష్యత్తులో మరింత ప్రమాదం ఉందన్నారు. మోడీని గద్దె దించకపోతే దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నారు. శాసనసభలో నికరమైన, నిబద్ధతతో కూడిన ప్రతిపక్షం అవసరమని తెలిపారు. అందుకే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో కళ్లం వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపిని, దానికి మద్దతిస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఇండియా వేదిక నాయకత్వంలో ప్రజా పరిపాలన వచ్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్రలో అరకు పార్లమెంటు అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి మద్దతివ్వడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఆ నియోజకవర్గం అభ్యర్థి మండంగి రమణ విస్తృత ప్రచారం నిర్వహించారు. గి రిజన సమస్యల పరిష్కారానికి తనను ఆదరించాలని కోరారు.

➡️