బహుముఖ ప్రజ్ఞాశాలి ఎం.హెచ్‌

-23వ వర్థంతి సభలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మోటూరు హనుమంతరావు అన్ని రంగాలపై సమగ్రమైన అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ప్రజాశక్తి మాజీ సంపాదకులు వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మోటూరు హనుమంతరావు 23వ వర్థంతి కార్యక్రమం తాడేపల్లిలోని ప్రజాశక్తి భవనంలో జరిగింది. ఎంహెచ్‌ చిత్రపటానికి వి శ్రీనివాసరావు, ఎంహెచ్‌గారి అల్లుడు, ప్రజా వైద్యులు డాక్టర్‌ కె సుధాకర్‌, మనవడు డాక్టర్‌ నవీన్‌, ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజరు వై అచ్యుత్‌రావు, సర్క్యులేషన్‌ జిఎం హరికిషోర్‌ తదితరులు పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ సవ్యసాచిగా మోటూరు హనుమంతరావు ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు. ఆయన ప్రజాశక్తిలో రాసిన సంపాదకీయాలు, రచనలు, బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాలు చాలా స్ఫూర్తిదాయకంగా వుండేవన్నారు. ఆయన ద్యాస పార్టీ అభివృద్ధి గురించే ఉండేదన్నారు. ఆయన ఉపన్యాసం గంభీరంగానూ, ఉత్తేజంగానూ చైతన్యం రగిలించేలా వుండేదన్నారు. సిపిఎం నిర్మాణం బలపడటంలో ఆయన చేసిన పోరాటం, పోషించిన పాత్ర అసాధారణమన్నారు. అప్పట్లో బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రజాశక్తి కార్యాలయంపై దాడి చేసి నిషేధిస్తే ఏ మాత్రం వెరవకుండా అజ్ఞాతంగా పేపర్‌పై చేతిరాతతో రాసి సమాచారన్ని పార్టీ శ్రేణులకు అందించే వారన్నారు. తెలుగు పేపర్లలో మొదట కంప్యూటర్‌ వాడింది ప్రజాశక్తిలోనేనని తెలిపారు. ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టడంతో పాటు ప్రజాశక్తిని బలంగా తయారుచేశారని అన్నారు. పార్టీలో చీలిక నేపథ్యంలో ఏ మాత్రం నిరాశ నిస్పృహలకు గురికాకుండా బలమైన వాదనతో పార్టీ విస్తరణకు విశేష కృషి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. తొలుత డాక్టర్‌ కె సుధాకర్‌ మాట్లాడారు. మోటూరు హనుమంతరావు ఏ స్థాయిలో వున్నా చాలా నిరాడంబరంగా వుండేవారని తెలిపారు. సైకిల్‌పై కార్యాలయానికి వచ్చేవారని అన్నారు. రిక్షాపుల్లర్‌లతో కూడా ఆప్యాయంగా మాట్లాడేవారని అన్నారు. ప్రతి ఒక్కరినీ సమదృష్టితో చూసే గొప్ప నాయకుడు, మానవతావాది అని కొనియాడారు. డాక్టర్‌ నవీన్‌ మాట్లాడుతూ తాతగారితో తమకున్న అనుబంధాన్ని, కార్యకర్తల పట్ల ఆయన చూపే ప్రేమాభిమానాలను వివరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన బి తులసీదాస్‌ మాట్లాడుతూ మోటూరు హనుమంతరావు రాసిన వ్యాసాలు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. కార్యకర్తలతో, సహచరులతో ఆయన మాట్లాడే తీరు, చూపించే వాత్సల్యం, ప్రేమ మరువలేనివన్నారు. సైద్ధాంతికపరంగా, రాజకీయపరంగా ఆయన స్పష్టత కలిగి దృఢచిత్తంతో వుండేవారని కొనియాడారు. మోటూరు హనుమంతరావు హయాంలోనే ప్రజాశక్తి తిరుపతి ఎడిషన్‌ ప్రారంభమైందన్నారు. ప్రజాశక్తి పత్రిక సాంకేతికంగానూ ముందడుగులో ఉందన్నారు. దేశంలో మొట్టమొదటగా యాపిల్‌ కంప్యూటర్లపై పేజీనేషన్‌ చేసిన ఘనత ప్రజాశక్తికే దక్కిందన్నారు. ప్రజాశక్తి పత్రికను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు.

➡️