అమరావతినే రాజధానిగా కొనసాగించాలి : సిపిఎం

Dec 18,2023 08:10 #amaravati, #CPM AP, #cpm v srinivasarao
cpm wishes to amaravati protest

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం అదోగతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేసింది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తి చేసుకును సందర్భంగా ఆదివారం ప్రత్యక్ష పోరాటంలో వున్న రైతులకు, కూలీలకు, రాజధానిబాధితులకు సిపిఎం రాష్ట్ర కమిటి అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. రాజధాని అమరావతి పోరాటానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. మూడు రాజధానుల పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, రైతులను వీధుల పాలు చేసిందని పేర్కొంది. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని అమరావతినే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని విషయంలోనూ నాటకాలాడుతూ రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు, బిజెపి విద్రోహానికి వ్యతిరేకంగా ప్రజలంతా అమరావతి పోరాటానికి అండగా నిలవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

అమరావతి రైతుల పోరాటం చారిత్రాత్మకం : సిపిఐ

రాష్ట్ర రాజధానిఅమరావతి అంశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగేళ్లపాటు రైతులు సాగించిన పోరాటం చారిత్రాత్మకమైన ఉద్యమమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రాజధానిప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమాలపై ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్భందాలను ప్రయోగించినా ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పటికైనా జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి ఉద్యమాన్ని గౌరవించి రాజధానిగా గుర్తించాలని కోరారు.

➡️