దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు..

May 4,2024 10:40 #Dalit youth, #police, #tortured

హైదరాబాద్‌ : ‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్‌ వాపోయారు. ఈ మేరకు ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడకు చెందిన శశాంక్‌ తెనాలిలోని ఒక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత నెల 30న కళాశాలలో పరీక్ష రాసి స్థానికంగా ఉన్న దుకాణం వద్ద మిత్రులతో కలిసి ఉండగా, 11 సంవత్సరాల బాలుడు ద్విచక్రవాహనాన్ని నడుపుతూ వారి మీదకు వచ్చాడు. అతణ్ని నిలువరించిన శశాంక్‌ ‘నీకు బండి ఎవరు ఇచ్చారు? పోలీసులతో చెబుతాను’ అని అన్నారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న తెనాలి ఏఎస్సై శ్రీనివాసరావు వారి దగ్గరికి వచ్చి.. పోలీస్‌ అంటున్నావు ఏంటంటూ అందరినీ తిడుతూ కొట్టారు. అనంతరం శశాంక్‌ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తిరిగి వెనక నుంచి వచ్చిన ఏఎస్సై అతని తలపై కొట్టడానికి ప్రయత్నించే క్రమంలో కిందపడ్డారు. ఈ ఘటనను మనసులో పెట్టుకొని ఈ నెల 1న సీఐ సుధాకర్‌, కొందరు కానిస్టేబుళ్లు శశాంక్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా నిర్బంధించి హింసించారు. పరీక్షలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు. 2వ తేదీ సాయంత్రం విడుదల చేశారు. కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి అతణ్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించి అవుట్‌పోస్టు పోలీసులకు విషయాన్ని చెబితే వారు వివరాలు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. చివరికి ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ విషయంపై తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ సుధాకర్‌ను వివరణ కోరగా.. ‘గత నెల 30న తెనాలి పీసీఆర్‌ ఏఎస్సై శ్రీనివాసరావు ఠాణాకు వస్తుండగా కళాశాల మార్గంలో కొందరు యువకులు మద్యం తాగుతూ ఒక బాలుడిని ఏడిపిస్తున్నారు. అది చూసిన ఏఏస్సై వారిని ప్రశ్నించి బాలుడిని అక్కడి నుంచి పంపేశారు. మీరు కూడా వెళ్లిపోవాలని యువకులకు చెప్పి వాహనంపై వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన శశాంక్‌ ఏఎస్సై తలపై కొట్టాడు. ఆయన కిందపడి గాయాలపాలై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా యువకుడికి నోటీసులు ఇచ్చి పంపించాం’ అని సీఐ తెలిపారు.

➡️