అప్రూవర్‌ అయినంత మాత్రాన దస్తగిరి నిర్దోషి కాదు

  • విచారణ జాప్యంలో రాజకీయ ప్రమేయం
  •  అవినాష్‌ నీ ఫోన్‌ సిబిఐకి అప్పగించు : వైఎస్‌ సునీత

ప్రజాశక్తి – కడప : మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినంత మాత్రాన కేసు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని వైఎస్‌.సునీత అన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపి అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కడప జయరాజ్‌ గార్డెన్స్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసు విచారణ జాప్యంలో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. తండ్రిని పోగొట్టుకున్న అనంతరం వివేకా కుటుంబం గురించి ఒక్కరోజైనా అవినాష్‌రెడ్డి ఆరా తీశారా? అని ప్రశ్నించారు. అవినాష్‌కి ధైర్యం ఉంటే ఫోన్‌ తెచ్చి సిబిఐకి అప్పగించాలన్నారు. అవినాష్‌ ఇంట్లో గజ్జల ఉదరు కుమార్‌రెడ్డి ఉన్నారని, అవినాష్‌కు ఫోన్‌ వచ్చిన 47 సెకండ్లలో హత్య జరిగిన ప్రదేశానికి ఆయన చేరుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివేకాది గుండెపోటు అని చెప్పారా? మర్డర్‌ అని చెప్పారా? అనేది అవినాష్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌కు మర్డర్‌ అని చెప్పిన వెంటనే డిజిపికి లేదంటే డిఐజికి ఎందుకు ఫోన్‌ చేయలేదని ప్రశ్నించారు. కేసులో సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయని ఉద్దేశంతోనే కేసును ఆంధ్ర నుంచి తెలంగాణకు మార్చారని అన్నారు. ఆధారాలు లేకుండా కబుర్లు చెబితే నమ్మే వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు. జగనన్న మీద ప్రేమతోనే అవినాష్‌ కోసం వివేకానందరెడ్డి ప్రచారం చేశారని, మీ కోసం కష్టపడిన వివేకా కోసం మీరు ఎంత వరకు కష్టపడ్డారు అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. వివేకా కేసు గురించి ఏ రోజైనా విచారణ అధికారులను కలిశారా? ఇది మీ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. జగన్‌ ముఖ్యమంత్రి, షర్మిల ఎంపి కావాలని తన తండ్రి చివరి కోరికని చెప్పారు. షర్మిల గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదన్నారు.

➡️