బిజెపి ఓటమితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

  • మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసం
  •  సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి

ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : బిజెపి ఓటమితోనే దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి అన్నారు. అనంతపురంలోని ఓ పంక్షన్‌ హాలులో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రజల అజెండాయే- ఎన్నికల అజెండా కావాలి’ అన్న అంశంపై ప్రాంతీయ సభను ఆదివారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబిలు ముఖ్య అతిథులుగా హాజరై ఇండియా వేదిక నాయకులను ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంఎ.బేబి మాట్లాడుతూ.. మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఎన్నికల సంఘాన్ని కూడా తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే విధంగా నియామకంలో మార్పులు తీసుకొచ్చారని విమర్శించారు. నియామక ప్రక్రియలో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి, సీనియర్‌ కేంద్ర మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కలిసి నియమిస్తారన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు అధికారపార్టీకి సంబంధించిన వారే ఉండడంతో వారనుకున్న వారినే నియమిస్తారన్నారు. తద్వారా తమకు అనుకూలంగా ఉన్న వారినే ఎన్నికల కమిషన్‌గా నియమించుకుంటారన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం నామమాత్రమే అవుతోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా చర్యల్లేవని బేబి విచారం వ్యక్తం చేశారు. ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రిని కాదని, పార్టీ అధ్యక్షుడికి తాఖీదులిచ్చి వదిలేసిందని తెలిపారు. మీడియా మొదలుకుని అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ మోడీ తమ నియంత్రణలో పెట్టుకుంటున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బిజెపిని ఓడించడం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ టిడిపి, వైసిపిలు బిజెపికి అనుకూలంగా మారాయని విమర్శించారు. ఈ ఐదేళ్లు అధికారంలోనున్న వైసిపి మూడు రాజధానులంటూ ఒకటి కూడా లేకుండా చేసిందని విమర్శించారు. బిజెపికి అనుకూలంగానున్న ఈ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా మాట్లాడుతూ.. మతత్వాన్ని రెచ్చగొట్టి బిజెపి మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చూస్తోందన్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మతాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు మోడీ చేస్తున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా బిజెపి పాలనలో పేదలను కొట్టి పెద్దలకు పంచిపెట్టారని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. మొదటి రెండు విడతల్లోనే జరిగిన ఎన్నికల తీరు చూస్తుంటే బిజెపికి ఓటమి తప్పదన్నది స్పష్టం అవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా వేదిక సభ్యులకు ఓటు వేసి ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం పరిరక్షించబడాలంటే ఇండియా వేదిక సభ్యులను గెలిపించుకోవాల్సిన అవసరముందని అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఈ పదేళ్ల మోడీ పాలనలో ఎక్కడలేని విధంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. 65 శాతానికి నిరుద్యోగం చేరిందని చెప్పారు. పది పోస్టులకు లక్ష మంది పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. అధికారంలోకి రాకముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్నది మరచిపోయారని పేర్కొన్నారు. మతాన్ని రెచ్చగొడ్డటం.. సంపదను కార్పొరేట్లకు పంచిపెట్టడానికే మోడీ పదేళ్ల పాలన సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వి,మల్లికార్జున, అనంతపురం అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి జాఫర్‌, రాప్తాడు కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, బాలరంగయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️