బిజెపిని, దాని మిత్రులను ఓడిస్తేనే ఉక్కుకు రక్షణ

Apr 7,2024 23:15 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీ మిత్రులుగా ఉన్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడిస్తేనే స్టీల్‌ప్లాంట్‌కు రక్షణ ఉంటుందని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చైౖర్మన్‌ మరడాన జగ్గునాయుడు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1151వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి జగ్గునాయుడు మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్‌ సేల్‌ పేరుతో నూరు శాతం అమ్మకానికి పెట్టి ప్రజా ద్రోహానికి పాల్పడిందన్నారు. ఆ ద్రోహానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికవర్గం, జిల్లా కార్మికులు, ప్రజలు మూడేళ్లుగా ఐక్య ఉద్యమం నడుపుతున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అష్టదిగ్బంధనం చేసి కావాలనే నష్టాల్లోకి నెట్టి కారు చౌకగా కార్పొరేట్ల చేతిల్లో పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు, విశాఖకు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్రంలోని బిజెపిని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఒంటరి చేయాల్సి ఉండగా, దానికి భిన్నంగా టిడిపి, జనసేన, వైసిపిలు ఆ పార్టీతో సఖ్యతగా మెలగడం ప్రజలను దగా చేయడమే అవుతుందన్నారు. పరిశ్రమలశాఖ మంత్రి, వైసిపి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌, టిడిపి విశాఖ ఎంపి అభ్యర్థి శ్రీ భరత్‌, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు స్టీల్‌ప్లాంట్‌ రక్షణ తమ ధ్యేయమని ప్రకటిస్తూ ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకూ అధికారంలో ఉన్న అమర్‌నాథ్‌ ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌ డి ఆదినారాయణ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో టిడిపి, వైసిపి, జనసేనలకు ఓట్లు వేస్తే ద్రోహం చేస్తున్న బిజెపి పక్షాన నిలిచినట్లవుతుందని అన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఒవి రావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి శ్రీనివాసరావు, నమ్మి రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వివి రమణ, పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️