పేదల ఇళ్లు కూల్చివేత 

Demolition of poor houses

జెసిబిలతో 60 నివాసాలు నేలమట్టం

ప్రజాశక్తి – రామచంద్రాపురం (తిరుపతి) : తిరుపతి రూరల్‌ చంద్రగిరి నియోజకవర్గం శివారు ప్రాంతం తుమ్మలగుంటలో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. హథీరాంజీ మఠం భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పర్చుకున్నారని బుధవారం ఉదయం పది జెసిబిలతో 60 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదల ఆక్రందనలు, అధికారుల జులంతో ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆర్‌డిఒను బాధితులు నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ మధ్యాహ్నం రెండుగంటల వరకూ నిరసన తెలిపారు. పేదలకు మద్దతుగా టిడిపి, జనసేన నాయకులు నిలిచారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన భార్య లక్ష్మి పేరిట దాదాపు 30 ఎకరాలు హథీరాంజీ మఠం భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, అంతటితో ఆగకుండా మరో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లపై కన్నేశారని టిడిపి చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కుట్రలో భాగంగానే టిడిపి నేత పులివర్తి నానిని అర్ధరాత్రి హౌస్‌ అరెస్టు చేసి పేదల ఇళ్లు కూల్చేశారన్నారు. పేదల ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులు భావిస్తే ముందుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు కట్టిన భారీ అంతస్తులు తొలగించాలని డిమాండ్‌ చేశారు. మఠం భూములు ఎవరూ కొనొద్దుగతంలో హథీరాంజీ మఠం భూముల పర్యవేక్షణ లోపం కారణంగా పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటుచేసుకున్నాయని, ఆ పొరపాటు కారణంగానే నేడు భూములను స్వాధీనం చేసుకోవాల్సి వస్తోందని మఠం ఫిట్‌ పర్సన్‌, డిప్యూటీ కలెక్టర్‌ రమేష్‌ నాయుడు తెలిపారు. కబ్జాదారుల మాటలు నమ్మి ఎవ్వరూ మఠం భూములను కొనుగోలు చేయవద్దని సూచించారు. భూముల స్వాధీనంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హథీరాంజీ మఠానికి చెందిన భూములు తుమ్మలగుంట పరిధిలోని 7/6, 26/3, 28, 33, 66 నుండి 95, 97, 98, 99, 100, 101 సర్వే నెంబర్లలో దాదాపుగా 165.78 ఎకరాలు ఉన్నాయని తెలిపారు.కొద్దిరోజులుగా సదరు సర్వే నంబర్లలో అనుమతులు లేకుండా అక్రమంగా శాశ్వత నిర్మాణాలను చేపట్టారని, హెచ్చరికలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మఠం భూముల పరిరక్షణలో భాగంగా ఆర్‌డిఒ, రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహాయంతో దాదాపు 40 ఇళ్లను నేలమట్టం చేశామన్నారు. మరికొన్న ఇళ్లను తొలగించాల్సి ఉందని తెలిపారు.

➡️