టిడిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ – వైసిపికి రాజీనామా

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :వైసిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. 2021లో టిడిపిలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. తరువాత ఇదే ఎమ్మెల్సీ పదవికి ఆయన తిరిగి ఎన్నికయ్యారు. 2023 మార్చితో ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. 2022 సెప్టెంబరులో తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా నియమించి రెండు నెలలకే తొలగించారు. ఆ తరువాత సిఎం జగన్‌ ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సిఎం జగన్‌ను మాణిక్య వరప్రసాద్‌ కలిసి.. తాడికొండ, ప్రత్తిపాడులో వైసిపి అభ్యర్థుల కోసం కృషి చేయాలని ఎన్నికల తరువాత తగిన ప్రాతినిధ్యం ఇస్తానని జగన్‌ చెప్పారు. ఇందుకు సంతృప్తి చెందని మాణిక్య వరప్రసాద్‌ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

➡️