‘రాజకీయ’ సామగ్రితో పరీక్షకు రావద్దు

Mar 18,2024 22:41 #10th exams, #AP
  •  పలమనేరు ఘటనతో అధికారుల ఆదేశాలు

ప్రజాశక్తి – యంత్రాంగం : రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్న ప్యాడ్లతో విద్యార్ధులు పరీక్షకు రావద్దని విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులకు సూచించారు. సోమవారం నాడు చిత్తూరు జిల్లా వికోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి కొందరు విద్యార్థులు పలమనేరులో వైసిపి ఎమ్మెల్యే వెంకట్‌గౌడ్‌ చిత్రాలున్న ప్యాడ్లతో పరీక్ష రాసేందుకు రావడం గందరగోళానికి దారితీసింది.
ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో రాజకీయ నేతల చిత్రాలున్న సామాగ్రితో పరీక్షకు అనుమతించబోమని ఇన్విజిలేటర్లు స్పష్టం చేశారు. దీంతో ఆ ప్యాడ్లను లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులెవ్వరూ రాజకీయ నేతల చిత్రాలున్న సామగ్రితో పరీక్షకు రావద్దని అధికారులు సూచించారు. కొన్నేళ్లుగా ఎమ్మెల్యే వెంకట్‌గౌడ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ఉచితంగా అందజేస్తూవస్తున్నారు. అయితే ఈ ఏడాది కోడ్‌ అమల్లో వుండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సివచ్చింది.
ఈ విషయాన్ని పలమనేరు ఆర్‌డిఒ దృష్టికి తీసుకెళ్లగా ఇది కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఇలాంటివి అనుమతించవద్దని ఎంఇఒలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
హెచ్‌ఎం తప్పిదంతో పరీక్ష రాయలేకపోయిన వికలాంగ విద్యార్థి
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఓ హెడ్‌మాస్టర్‌ తప్పిదం కారణంగా వికలాంగ విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చిలమత్తూరు మండలం కోడూరు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి వరుణ్‌కుమార్‌ రెడ్డి వికలాంగుడు (ఇంటాక్టువలీ డిసబులిటీ). పరీక్ష రాయడానికి విద్యార్థికి శరీరం సహకరించదు. తనకు తోడుగా మరొకరితో పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో వైకల్య సర్టిఫికెట్‌తో హెడ్‌మాస్టర్‌ దరఖాస్తు చేయాలి. అయితే ఆయన సర్టిఫికెట్‌ సమర్పించకపోవడంతో పరీక్ష రాసేందుకు మరొకరి సహాయం లేకుండా పోయింది. దీంతో ఆ విద్యార్థి తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో తీవ్ర ఆవేదన గురయ్యాడు. ఈ విషయంపై ఎంఇఒను సంప్రదించగా హెచ్‌ఎం తప్పిదమే వల్లే ఇలా జరిగిందన్నారు. వైకల్య సర్టిఫికెట్‌, హాల్‌ టికెట్‌ ఆధార్‌ ఆధారంగా విద్యార్థికి (స్క్రైబ్‌) వలంటీర్‌ను పరీక్ష కేంద్రం ఛీప్‌ అనుమతించవచ్చని తెలిపారు.

➡️