ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2023 ఖరీఫ్‌ సీజన్‌లో కరవు కారణంగా 6,95,897 మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చాయి. సీఎస్‌ జవహర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్‌ కమిటీలో ఈ అంశంపై చర్చించి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం కోసం పంపారు. ఈ మేరకు ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకూ ఇన్‌పుట్‌ సబ్సిడీ నిలుపుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.640 కోట్ల విద్యా దీవెన పథకం నిధుల విడుదల పైనా స్క్రీనింగ్‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ నిధుల విడుదల వాయిదా వేయాలని ఈసీ సూచించింది.

➡️