మెగా డిఎస్సీ కాదు.. ధగా డిఎస్సీ..

Jan 31,2024 17:33 #DSC Notification, #DYFI, #Mega DSC
dyfi on mega dsc
  • డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న
  • 25 వేల డియస్సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్

ప్రజాశక్తి – చీరాల : ఇది మెగా డీఎస్సీ కాదు.. ధగా డీఎస్సీ.. అంటూ  డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గుమ్మల రామన్న అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పైగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రచారంపై రామన్న ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం స్థానిక లూధరన్ కళాశాలలో ప్రజా సంఘాలు మరియు కళాశాల నిర్వాహకులు గ్రూప్ 2 అభ్యర్థులకు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఉచిత కోచింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డివైఎఫ్ఐ నిరుద్యోగుల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు చేసిన పోరాటాల ఫలితంగా నేడు నోటిఫికేషన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. అది కూడా దిగదుడుపు చర్యగా విడుదల చేయటం బాధాకరం అన్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని డీఎస్సీ నోటిఫికేషన్ ఏటా 20వేల పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చాక గడచిన నాలుగున్నర సంవత్సర కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లక్షకు పైగా పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని ఉద్యోగాలను భర్తీ చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలలను వివిధ కారణాలతో ప్రభుత్వం మూసేసింది అన్నారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులుకు ఓవైపు నోటిఫికేషన్లు రాక మరోవైపు వయో పరిమితి దాటుతుండటంతో అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని 25 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ చీరాల ప్రాంతీయ కార్యదర్శి పి సాయిరాం అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు భగవాన్ దాస్ పాల్గొన్నారు.

➡️