బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతానికి కృషి

May 7,2024 23:42 #Chandrababu Naidu, #speech

– తిరుపతి రోడ్డుషోలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :’తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం. టిటిడి మొదలుకొని అన్ని దేవాలయాల్లోనూ ట్రస్టు బోర్డు మెంబర్లుగా బ్రాహ్మణులను నియమించే బాధ్యత మాది. వైసిపి పాలనలో 120 ఆలయాలపైన, అర్చకులపైన దాడులు చేశారు. దేవాలయ ఆస్తులు కబ్జా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే విచారణ జరిపి దేవాలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేవాలయాల పవిత్రత కాపాడతాం’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌ నుంచి దేవేంద్ర థియేటర్‌, పాత కార్పొరేషన్‌ కార్యాలయం మీదుగా నాలుగు కాళ్ల మండపం వరకూ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతిలో దొంగలు పడ్డారని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌కు నెల్లూరుతో ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో, తనకు తిరుపతితో అలాంటి సంబంధమే ఉందని, తిరుపతిలో ప్రతి గల్లీ తాను తిరిగినదేనని చెప్పారు. తిరుపతిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి 10 నుంచి 15 శాతం కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. పేరుకే తిరుపతి మేయర్‌ అని, పెత్తనమంతా డిప్యూటీ మేయర్‌దేనన్నారు. తిరుపతి అభివృద్ధి అంతా టిడిపి హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. తిరుపతిని పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మోడీ, తాను, పవన్‌కల్యాణ్‌ తీసుకుంటామని చెప్పారు. సమయం ముగియడంతో ‘హలో తిరుపతి, బారుబారు జగన్‌’ అంటూ సభను ముగించారు. సభ ప్రారంభానికి ముందుగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. అభినరురెడ్డి కావాలా? కోడిబచ్చుపైన వ్యాపారం చేసే భూమన కరుణాకర్‌రెడ్డి, కొడుకు అభినరురెడ్డి కావాలా? అని ప్రశ్నించారు. అమరరాజా పరిశ్రమను తిరిగి తిరుపతికి తీసుకొచ్చి, ఉపాధి కల్పిస్తామన్నారు. తిరుమల తిరుపతి నిధులతో విద్య, వైద్యంతో పాటు స్థానిక ప్రజల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు నరసింహయాదవ్‌, సిఆర్‌ రాజన్‌, సుగుణమ్మ, భానుప్రకాష్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌రాయల్‌ పాల్గొన్నారు.

➡️