పోలింగ్‌కు సర్వం సిద్దం

May 12,2024 08:15 #election, #ready for polling
  • అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌
  • పాలకొండ, కురుపాం, సాలూరుల్లో సాయంత్రం 5గంటల వరకే పోలింగ్‌
  • ఏజెంట్లుగా నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు ఎవరైనా ఉండొచ్చు
  • సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగనుండగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన 169 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు జరుగనుంది. పాలకొండ (ఎస్‌టి), కురుపాం (ఎస్‌టి), సాలూరు (ఎస్‌టి) నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5గంటల వరకు, అరుకు వ్యాలీ(ఎస్‌టి) పాడేరు (ఎస్‌టి)రంపచోడవరం (ఎస్‌టి) నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని సిఇఓ తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో ఎన్నికల ఏర్పాట్లు, బందోబస్తు, పోలింగ్‌ ప్రక్రియ లాంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మొబైల్‌ పోన్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు ఎవరూ తీసుకురాకూడదన్నారు. నాలుగైదు జిల్లాల్లో పోలింగ్‌ బూత్‌ స్లిప్స్‌తోపాటు ఇతర మెటీరియల్‌ను ఎన్నికల కమిషన్‌ సీజ్‌ చేసింది. పల్నాడు, ఒంగోలులో ఇటువంటి వాటిని సీజ్‌ చేయడంతో పాటు ఇందుకు బాధ్యులైన వారికి ఎన్నికల కమిషన్‌ నోటీసులిచ్చింది.

12,438 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా అందులో 12,438 సమస్యాత్మకమైనవిగా ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. ఇందులో మావోయిస్టు ప్రభావిత పోలింగ్‌ స్టేషన్లు 698 ఉన్నాయి, మొత్తం పోలింగ్‌ స్టేషన్లలో 34,651 (74.70శాతం) స్టేషన్లలో వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పోలింగ్‌ స్టేషన్లలో లోపల వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం పోలింగ్‌ స్టేషన్‌ బయట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు 1,06,145 మంది పోలీసులను వినియోగించనున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల వద్ద బందోబస్తుకు సిఆర్‌పిఎఫ్‌ను వినియోగించనున్నారు.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో మూడు క్యూ లైన్లు
ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌ మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తోంది. ఒక లైను పురుషులకు, రెండో లైను మహిళలకు, మూడో లైన్‌ సీనియర్‌ సిటిజన్లు, వికలాంగుల కోసం కేటాయించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటు ఉన్న వారిని మాత్రమే పోలింగ్‌బూత్‌ల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లుగా నియమించాలి.

మూడు రోజులు పరీక్షలు నిర్వహించొద్దు
విద్యార్థులు తమ ఓటు హక్కును వారి స్వగ్రామాల్లో వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్‌కు ఒక రోజు ముందు, పోలింగ్‌ జరిగే రోజు, తిరిగి వారి గ్రామాల నుంచి కళాశాలకు తిరిగి వచ్చేందుకు వీలుగా ఆ మూడు రోజులు విద్యాలయాల్లో ఎటువంటి పరీక్షలు నిర్వహించొద్దని విద్యాసంస్థలకు ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఎన్నికలు జరిగే రోజు ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో పరీక్షలు ఉన్నాయని, తాము ఓటు హక్కు వినియోగించుకునేది ఎలా అంటూ విద్యార్థులు ఇసిని సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు విద్యాలయాలకు సూచించినట్లు సిఇఓ తెలిపారు.

➡️