పెన్షన్‌దారులకు రూ.30 వేలు చొప్పున ఎగనామం : అచ్చెన్నాయుడు

Jan 1,2024 20:04 #Atchannaidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పి ఒక్కో పెన్షన్‌దారుడికి రూ.30 వేలు చొప్పున ఎగనామం పెట్టారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికారంలోకి రాగానే పెన్షన్‌ రూ.3 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ఏటా పెంపు అంటూ మాట మార్చారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెన్షన్‌దారులకు రాసిన లేఖలో కూడా అవే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు 2019 నాటికి రూ.2 వేలుకు పెంచారని, 34 లక్షల మంది లబ్ధిదారులను 54.25 లక్షలకు పెంచారని వివరించారు. జగన్‌ రూ.750 పెంచి ఉద్ధరించానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ మొత్తాన్ని ఎక్కడైనా తీసుకునే అవకాశముంటే, ఇపుడు కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలంటూ జిఓలిచ్చారని విమర్శించారు.

మహిళలపై పెచ్చరిల్లిన అత్యాచారాలు : అనిత

విచ్చిలవిడిగా డ్రగ్స్‌, గంజాయి కారణంగా మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయని తెలుగు మహిళా అధ్యక్షులు వంగలపూడి అనిత విమర్శించారు. ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనే భరోసాతో వైసిపి అనుకూల రౌడీ గ్యాంగ్‌లు పెచ్చుమీరిపోతున్నాయని ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి సమీపంలో దళిత యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితుడు వెంకట్‌రెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️