బిజెపి కబంధ హస్తాల నుండి రైతులు, ప్రజలను రక్షించుకోవాలి : కార్మిక, రైతు సంఘాల ఐక్యవేదిక

Nov 26,2023 11:22 #BJP, #farmers, #Labor, #people, #protect
  • 27, 28 తేదీల్లో మహాధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దేశంలో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలను రక్షించుకోవాలని రైతు, కార్మిక సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. 27, 28 తేదీల్లో జరిగే మహాధర్నాకు సంబంధించి శనివారం కందుకూరి కల్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. నవంబరు 27, 28 తేదీల్లో జింఖానా గ్రౌండ్‌లో మహాధర్నా జరగనుందని, దీనిలో అందరూ పాల్గొని మోడీ విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సహజ వనరులు ప్రజలకు చెందాల్సి ఉండగా కొద్దిమంది కోటీశ్వరుల వద్ద పోగుపడుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రజల హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దేశాన్ని దివాళా తీయించిన మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపి ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారని విమర్శించారు. అదానీ, అంబానీల అడ్డాగా దేశాన్ని మార్చారని పేర్కొన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ.. రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యోగ, మహిళా, మైనార్టీ, దళిత, షెడ్యూలు తెగల సమస్యల పరిష్కారానికి రైతులు, కార్మికులు, కష్టజీవులు కలిసి రావాలన్నారు. సహజ వనరులన్నీ అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న బిజెపి పాలనను గద్దె దించాలని కోరారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముతోందని పేర్కొన్నారు. కరువు ఏర్పడి రైతులు, కూలీలు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నదీ జలాలు వృథాగా సముద్రం పాలవుతుంటే పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. బిజెపి కబంధ హస్తాల్లో నుండి వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. దీనికోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలోకి రావాలని కోరారు. రైతు సంఘాల నాయకులు కెవివి ప్రసాద్‌, సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఐదో షెడ్యూలు కల్పించిన హక్కుల ప్రకారం ఆదివాసీలను, గిరిజనులను వారి భూముల నుండి తరిమేయొద్దని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, వేర్వేరు సంఘాల నాయకులు దడాల సుబ్బారావు, కె ధనలక్ష్మి, ఎం హరిబాబు, పి జమలయ్య, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, కుర్రా నరేంద్ర, ఎ రవిచంద్ర, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️