అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

Dec 27,2023 21:40 #America, #road accident

-అమలాపురానికి చెందిన ఐదుగురు దుర్మరణం

-మృతులు ముమ్మిడివరం ఎంఎల్‌ఎ సతీష్‌ చిన్నాన్న కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి- అమలాపురం, ముమ్మిడివరం :అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెక్సాస్‌ హైవేలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌కుమార్‌ చిన్నాన్న కుటుంబ సభ్యులు.కుమార్తెను చూసేందుకు వెళ్లి…అమలాపురం పట్టణానికి చెందిన పొన్నాడ నాగేశ్వరరావు ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌కు స్వయానా చిన్నాన్న. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. మూడో కుమార్తె నవీన గంగ తన భర్త, కుమారుడు, కుమార్తెతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. వారం క్రితం నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి అమెరికాలో ఉంటున్న కుమార్తె, అల్లుడు, మనువళ్లను చూసేందుకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం నాగేశ్వరరావు దంపతులు, కుమార్తె కుటుంబంతో పాటూ అమెరికాలోనే ఉంటున్న మరో ముగ్గురు బంధువులతో కలిసి వ్యాన్‌లో బయటకు వెళ్లారు. వీరు టెక్సాస్‌ హైవేపై వెళ్తుండగా ట్రక్కు వేగంగా వచ్చి ఢకొీంది. ఈ ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు (65), ఆయన భార్య సీతామహాలక్ష్మి (59), కుమార్తె నవీన గంగ (35,) మనువడు కృతిక్‌ (7), మనువరాలు నిషిద్ధత (9) అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లుడు లోకేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన టెక్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఎంఎల్‌ఎ పొన్నాడ ఇంట విషాదంఈ ఘటన నేపథ్యంలో అమలాపురంలోని ఎంఎల్‌ఎ పొన్నాడ ఇంట విషాదం నెలకొంది. ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌కుమార్‌, ఆయన చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబాలు అమలాపురంలోనే నివాసం ఉంటున్నాయి. నాగేశ్వరరావు అమలాపురంలో టింబర్‌ డిపో నడుపుతున్నారు. స్థానికంగా అందరిలో తలలో నాలుకగా ఉండేవారు. ఆయన మరణంతో అమలాపురంలో విషాదం చేటుచేసుకుంది. మరణవార్త తెలియగానే పొన్నాడ ఇంటికి పలువురు నాయకులు వెళ్లి పరామర్శించారు.

➡️