కౌంటర్‌ దాఖలు చేయండిటెట్‌, టిఆర్‌టి నోటిఫికేషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Feb 19,2024 21:52 #AP High Court
Ads subject to Supreme Guidelines

ప్రజాశక్తి-అమరావతి : ఎపి టెట్‌, ఎపి టిఆర్‌ఆర్‌టి నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రభుత్వ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపి టెట్‌), 12న ఇచ్చిన టీచర్‌ రిక్రూట్‌ టెస్ట్‌ (ఎపి టిఆర్‌టి) నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఆ రెండు పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు సహా ఐదుగురు దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ అనుమతినిచ్చి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, నియామక పరీక్ష నిర్వహణకు ఒకేసారి షెడ్యూల్‌ ప్రకటించడాన్ని అడ్డుకోవాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ బి ఆదినారాయణరావు కోరారు. టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే టీచర్‌ రిక్రూట్‌మెంటు టెస్టులో పాల్గొనేందుకు అర్హులన్నారు. టెట్‌ ఫలితాలను మార్చి 14న ప్రకటిస్తుండగా, ఆ తరువాత రోజే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారని అన్నారు. టిఆర్‌టికి అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదన్నారు. ఈ నెల 27న పరీక్ష నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించారన్నారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు అభ్యర్థులకు కేవలం 19 రోజుల సమయం మాత్రమే ఉందని, హడావుడిగా ప్రక్రియ పూర్తి చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని చెప్పారు.

➡️