మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న బిజెపి

Mar 13,2024 11:02 #Communists, #CPM AP, #Profiles, #srikakulam
  • సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు
  • తొలి తరం కమ్యూనిస్టు నేత తరుణాచారి స్మారక స్తూపం ఆవిష్కరణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత సామరస్యాన్ని దెబ్బతీస్తోందని సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి వద్ద ఏర్పాటు చేసిన తొలితరం కమ్యూనిస్టు నేత గానుగుల తరుణాచారి స్మారక స్తూపాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మధు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి ప్రభుత్వం ముస్లిముల పట్ల తీవ్ర వివక్ష చూపేలా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. దీనిపై ముస్లిముల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా నాడు సాగిన జాతీయోద్యమ స్ఫూర్తిని బిజెపి దెబ్బతీస్తోందన్నారు. మోడీ పదేళ్ల పాలనలో అన్ని తరగతుల ప్రజలూ తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు అందించే ఎరువులు, విత్తనాలపై సబ్సిడీలు ఎత్తేశారని గుర్తు చేశారు. వామపక్షాలు పోరాడి సాధించిన అటవీ హక్కుల చట్టానికి మోడీ తూట్లు పొడుస్తున్నారన్నారు. గిరిజనులకు జీవనాధారంగా ఉన్న కొండలను, అడవులను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దానం ప్రాంతంలో రైతు ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో గానుగుల తరుణాచారి కీలక భూమిక పోషించారని తెలిపారు. మందస జమిందారీ పోరాటంతో ఈ ప్రాంతంలో కమూనిస్టు ఉద్యమం ప్రారంభమైందని, దీనికి తరుణాచారి, మార్పు పద్మనాభం, బెందాళం గవరయ్య నాయకత్వం వహించారని వివరించారు. నేటి యువతరం ఆ పోరాటాల స్ఫూర్తితో మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మామిడిపల్లి గ్రామ కూడలి వద్ద తొలుత కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి మధు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు వాయిద్యాలు, ప్రజా నాట్య మండలి కళాకారుల పాటలతో సభా వేదిక అయిన గానుగుల తరుణాచారి విజ్ఞాన కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు. గానుగుల తరుణాచారి విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు జుత్తు సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కేంద్రం చైర్మన్‌ పాతిని కృష్ణమూర్తి, కె.మోహనరావు, ఎస్‌.లకీëనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️