ఎన్నికల్లో మాజీ సిఎంలు

Apr 25,2024 00:29 #elections, #ex cms

-చంద్రబాబు అసెంబ్లీకి.. నల్లారి పార్లమెంటుకు..!
– ఇద్దరూ ఒకే కూటమి నుంచే
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఇద్దరూ ఒకే కూటమి నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. చంద్రబాబు 1978లో సొంతూరైన నారావారిపల్లి నియోజకవర్గం చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 వరకూ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత సామాన్య రైతు మీసాల వెంకట్రామనాయుడు చంద్రబాబుపై గెలుపొందారు. రాష్ట్రంలోనే చివరి నియోజకవర్గమైన కుప్పంను అభివృద్ధి చేస్తానంటూ చంద్రగిరి వదిలి 1985లో కుప్పంకు వలసెళ్లారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996-99, 1999-2004 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్‌టిఆర్‌ కేబినెట్‌లో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా 14 ఏళ్లు ఉన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా 2014-19 వరకూ ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిదోసారి కుప్పం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా వైసిపి నుంచి ఎమ్మెల్సీ భరత్‌, కాంగ్రెస్‌ నుంచి ఆవుల గోపీ పోటీ చేస్తున్నారు.

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు నియోజకవర్గం కలికిరి వాస్తవ్యుడు. (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పరిధి) తండ్రి నల్లారి అమరనాథరెడ్డి 1972, 1978, 1985లో ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ ఉన్నారు. 1989, 1999, 2004, 2009లో ఆయన పోటీ చేశారు. ప్రభుత్వ విప్‌గా, స్పీకరుగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి రాష్ట్రంలో పలుచోట్ల పోటీచేసినా డిపాజిట్లు దక్కలేదు. పార్టీని రద్దు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ 2018, జులైలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజంపేట బిజెపి ఎంపి అభ్యర్థిగా టిడిపి-జనసేన-బిజెపి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ రెండు సార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎంపిగా గెలుపొంది ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. పుంగనూరు, మదనపల్లి, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లో ముస్లీం మైనార్టీల ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. 11 సార్లు కాంగ్రెస్‌, రెండు సార్లు టిడిపి, ఒక్కసారి స్వతంత్రులు, రెండుసార్లు వైసిపి గెలుపొందింది.

➡️