పింఛను కోసం పడిగాపులు ..నలుగురు వృద్ధులు మృతి

Apr 3,2024 23:55 #Padigapu, #Pension

అవసరం మేరకు జమకాని డబ్బులు
-సాయంత్రం వరకూ వేచి ఉన్న పింఛనుదారులు
-సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు కరువు
ప్రజాశక్తి-యంత్రాంగం :పింఛన్ల కోసం పింఛనుదారులు సచివాలయాల వద్ద పడికాపులు కాశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించినా ఈ సమాచారం తెలియక కొందరు, పింఛను అందుతుందో లేదోననే భయంతో మరికొందరు, ఎంత తీవ్రతకు భయపడి ఇంకొందరు ఉదయం తొమ్మిది గంటలకే ఆయా సచివాయాలకు చేరుకున్నారు. వారిలో నలుగురు వృద్ధులు మృతి చెందారు. కొన్ని సచివాలయాల వద్ద తాగు నీరు, టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, అరకొరగా మాత్రమే కుర్చీలు ఏర్పాటు చేయడంతో పింఛనుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్‌లో గంటల కొద్దీ నిల్చోలేక వృద్ధులు తీవ్ర అవస్థ గురయ్యారు. పండు ముదుసలులకు, వికలాంగులకు ఇంటికే పింఛను పంపిణీ చేయాలని ఆదేశించినా కొన్ని జిల్లాల్లో ఇది అమలు కాలేదు. సంబంధిత సచివాలయ ఉద్యోగి పంపిణీ చేయాల్సిన మొత్తానికి అనుగుణంగా డబ్బులు సమ కాకపోవడం, ఆలస్యంగా డబ్బులు జమ కావడంతో పింఛన్ల పంపిణీ తీవ్ర జాప్యమైంది. సాయంత్రం ఐదు గంటల తర్వాతే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అంతవరకూ వేచి ఉరడలేక కొందరు పింఛనుదారులు వెనుదిగారు.
నలుగురు వృద్ధులు మృతి
పింఛను తీసుకోవడానికి వచ్చిన వారిలో నలుగురు వృద్ధులు మృతి చెందారు. తిరుపతి జిల్లా నెరబైలు గ్రామపంచాయతీ సచివాలయానికి వచ్చి వేచి ఉన్న అదే గ్రామానికి చెందిన షేక్‌ అసం సాహెబ్‌ (75) ఫిట్స్‌ వచ్చి కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని సాయినగర్‌కు చెందిన ఈశ్వరవాక లలితమ్మ (62) గాండ్లవీధిలోని శ్రీ స్వశక్తి భవనంలోగల సచివాలయానికి మధ్యాహ్నం వచ్చారు. సాయంత్రం ఆమెకు వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయారు. సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన వెంపటి వజ్రమ్మ (80), పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (70)లు పింఛను తీసుకోవడానికి సచివాయాలకు వచ్చి వడదెబ్బకు గురై మృతి చెందారు.
సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడు
డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో నాలుగో నెంబరు సచివాలయం వద్ద పెన్షన్‌ కోసం వచ్చిన కొంకాపల్లికి చెందిన కురసాల నరసింహమూర్తి(70) సొమ్మసిల్లి పడిపోయాడు. సచివాలయ సిబ్బంది సపర్యలు చేసి ఆయనను ఆస్పత్రికి తరలించడంతో కోలుకున్నారు.
అల్లూరి ఏజెన్సీలో సక్రమంగా పంపిణీ కాని పింఛన్లు
అల్లూరి సీతారామరాజు లోతేరు పంచాయతీ పరిధి తోటవలస, తదితర గ్రామాల వృద్ధులు, వికలాంగులు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని గ్రామ సచివాలయానికి కాలినడకన వచ్చారు. ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. రాత్రి వరకూ వేచి ఉన్నా వారికి పింఛన్లు అందలేదు. అరకులోయ మండలంలో 6630 మంది పింఛనుదారులు ఉండగా సుమారు 150 మందికి మాత్రమే పింఛన్లు అందాయి. హుకుంపేట మండలంలో 33 పంచాయతీలు ఉండగా, నాలుగు పంచాయతీల పరిధిలోనే మాత్రమే పింఛన్లు పంపిణీ జరిగింది. డుంబ్రిగుడ మండలం అరకు మేజర్‌ పంచాయతీలోని సచివాలయానికి కాళ్లు చచ్చుబడిన లబ్ధిదారుడిని ఆటోలో తీసుకొచ్చారు. అడ్డతీగల మండలంలో సాంకేతిక కారణాల వల్ల పింఛన్లు పంపిణీ జరగలేదు. మారేడుమిల్లి మండలంలో పింఛనుదారులు దూర ప్రాంతాల నుంచి సచివాలయాలకు వచ్చినప్పటికీ పింఛన్లు ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. పోలవరం నిర్వాసిత మండలాల్లోనూ పింఛన్లు అందలేదు. గురువారం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ాపశ్చిమగోదావరి జిల్లాలో రూ.68.92 కోట్లను పింఛనుదారులకు అందించాల్సి ఉండగా,. రూ.45.37 కోట్లు మాత్రమే బ్యాంకులకు విడుదలైంది. మిగిలిన రూ.24 కోట్లు విడుదల కావాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి జిల్లాలోని బ్యాంకులకు పింఛను డబ్బులు జమయ్యాయి. జిల్లాలో 2,34,884 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉండగా, వారిలో 68,103 మందికి మాత్రమే తొలిరోజు పింఛను అందింది.
ాగుంటూరు జిల్లాలో 2.61 లక్షల మందికి పింఛను ఇవ్వాల్సి ఉండగా సాయంత్రం వరకు 80 వేల మందికి మాత్రమే అందింది. పల్నాడు జిల్లాలో 2.83 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా 90 వేల మందికి పింఛన్లు ఇచ్చారు. గుంటూరులోని ఒక సచివాలయం అడ్మిన్‌కు ఆరు లక్షల రూపాయలు రావాల్సి ఉండగా, తొలిరోజు రెండు లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. మరో సచివాలయం ఉద్యోగికి రూ.18 వేల మాత్రమే ఖాతాలో జమయ్యాయి.
ాఅనంతపురం జిల్లాలో 2.89 లక్షల మంది పింఛనుదారులు ఉండగా వారిలో 25 శాతం మందికి, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 2,72,767 మంది పింఛనుదారులు ఉండగా వారిలో 25 శాతం మంది మందికి తొలిరోజు పింఛను అందింది.
ానెల్లూరు జిల్లాలో తొలిరోజు 1.66 లక్షల మందికి (62 శాతం మందికి) రూ.47 కోట్లు పంపిణీ జరిగింది.
ాకర్నూలు జిల్లాలో 2,46,871 పింఛనుదారులు ఉండగా తొలిరోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది 90,355 (36.6 శాతం) మందికి పింఛన్లు పంపిణీ చేశారు.

➡️