జెన్‌కో ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

  • బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనొద్దు
  • థర్మల్‌ ప్లాంట్లను మెరుగుపరచాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు
  • ముగిసిన ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయ సేకరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని జెన్‌కో ప్లాంట్ల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌ సంస్థలకు అడ్డగోలుగా రాయితీలు ఇస్తోందని, ఇది సరైన విధానం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కేటాయిస్తూ జెన్‌కో ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యుత్‌ సంస్థల ఎఆర్‌ఆర్‌పై సోమవారం నుంచి జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ గురువారంతో ముగిసింది. జెన్‌కో సమర్పించిన బహుళ వార్షిక కాలవ్యవధి 2024-29 నియంత్రణ కాలానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఎపిఇఆర్‌సి జస్టిస్‌ ఛైర్మన్‌ నాగార్జున రెడ్డి విశాఖపట్నంలోని ఇపిడిసిఎల్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరించారు. ముందుగా జెన్‌కో ప్రతిపాదనలను ఆ సంస్థ ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌ బాబు వివరించారు. అనంతరం బాబూరావు మాట్లాడుతూ.. 4, 5వ నియంత్రణ కాలంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు కోసం జెన్‌కోకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. నిధులివ్వకుండా ప్రజల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. ప్రజల డబ్బులతో ఏర్పాటుచేసిన దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ప్రైవేట్‌కు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తమ పార్టీతో పాటు, ప్రజలు, విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన చేయడంతో ప్రైవేటీకరణ ఆగిందన్నారు. థర్మల్‌ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గు కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయపరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డి మాండ్‌ చేశారు. కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి ధరలు పెంచారని, దీనివల్ల వినియోగదారులపై ట్రూఅప్‌, ఎఫ్‌పిపిసిఎ వంటి భారాలు పడుతున్నాయని చెప్పారు. బొగ్గు కొరతతో వర్షాకాలంలో సైతం కరెంటు కోతలు నెలకొన్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు. బొగ్గు, గ్యాస్‌ సరఫరాలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరించి కేంద్రానికి లొంగిపోయిందని విమర్శించారు. థర్మల్‌ ప్లాంట్ల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కొత్త ప్లాంట్లు ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి బొగ్గు గనులు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను మెరుగుపరచాలని, జెన్‌కో బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జెన్‌కోను బలపరిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని, విద్యుత్‌ రంగం మెరుగుపడుతుందని అన్నారు. విద్యుత్‌ రంగ నిపుణులు ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ.. జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను కాకుండా డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. నాలుగేళ్ల నుంచి వేల మిలియన్‌ యూనిట్ల (ఎంయు) విద్యుత్‌ మిగులుగా చూపుతున్నారని తెలిపారు. మెరిట్‌ ఆర్డర్‌ అంటూ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని, జెన్‌కోపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వినియోగదారులపై భారాలు పడే ఈ అంశాలను సరిదిద్దుకోవాలని చెప్పారు. మార్కెట్‌ నుంచి వేల కోట్లు చెల్లించి ముందుగానే చెల్లిస్తున్న డిస్కంలు.. జెన్‌కోకు మాత్రం చెల్లించడం లేదన్నారు. కొత్త ప్రాజెక్టులు నెలకొల్పి జెన్‌కో సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవడంలో చిన్నచూపు కనపడుతోందని విమర్శించారు. విద్యుత్‌ సంస్థల తరపున ఇపిడిసిఎల్‌ సిజిఎం డి సుమాన్‌ కళ్యాణి అభిప్రాయాలు తెలిపారు.

అభ్యంతరాలు పరిశీలిస్తాం : ఛైర్మన్‌ నాగార్జున రెడ్డి

ప్రజాభిప్రాయ సేకరణలో కమిషన్‌ పరిధిలో లేవనెత్తిన అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్‌ నాగార్జున రెడ్డి చెప్పారు. పరిధిలో లేని వాటిని కూడా సంబంధిత అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తామన్నారు.

➡️