బీహార్‌కు ‘హోదా’

Jun 30,2024 00:24 #'Hoda', #Bihar

-నీట్‌ నిందితులకు కఠిన శిక్ష
-కేంద్రానికి నితీష్‌ కుమార్‌ మెలిక
-జెడియు జాతీయ కార్యవర్గం డిమాండ్‌
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్‌డిఎ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగాఉన్న బీహార్‌ ముఖ్యమంత్రి, జెడియు నేత నితీష్‌కుమార్‌ మోడీ సర్కారుకు గట్టి మెలిక పెట్టారు. తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకంగా తీర్మానం చేయించారు. దీనితో పాటు జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన నీట్‌ అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. పేపర్ల లీకేజికి కారకులైన వారిని కఠింగా శిక్షించాలని డిమాండ్‌ చేయడంతో పాటు, పరీక్షల్లో అక్రమాలు నిరోధించేందుకు ప్రత్యేకమైన కఠిన చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జెడియు చేసిన ఈ డిమాండ్‌తో మోడీ సర్కారుకు మద్దతిస్తున్న టిడిపితో పాటు, మన రాష్ట్రంలో ప్రతిపక్ష వైసిపి కూడా ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిషయంలో మౌనం దాల్చడం చర్చనీయాంశమైంది. నీట్‌ విషయంలో కూడా ఈ రెండు పార్టీలు ఇప్పటి వరకు ఏమీ మాట్లడకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న ఈ వైఖరికి భిన్నంగా ఎన్‌డిఎకు మద్దతిస్తూనే జెడియు బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేయడంతో పాటు, హోదా సాధన కోసం పొరాటాన్ని సాగిస్తామని కూడా జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానంలో జెడియు పేర్కొంది. ‘హోదా బీహార్‌కు అత్యంత ముఖ్యమైన విషయం. దీనిని సాధించి తీరాలి. ‘ అని కూడా తీర్మానంలో పేర్కొన్నారు. పన్నెండు మంది సభ్యులతో ఎన్‌డిఎ కూటమిలో మూడవ పార్టీగా జెడియు ఉండటం గమనార్హం. సమావేశం ముగిసిన తరువాత జెడియు జాతీయ ప్రతినిధి కెసి త్యాగి మాట్లాడుతూ ‘బీహార్‌కు ప్రత్యేకహోదా డిమాండ్‌ కొత్తదేమి కాదు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధిచేయడానికి అదిఎంతో కీలకం’ అని అన్నారు. దీనితో పాటు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50నుండి 65శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి వేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన చెప్పారు. పార్టీ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు గానూ రాజ్యసభ ఎంపి సంజరు ఝాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేసినట్లు త్యాగి చెప్పారు.

➡️