భారీగా మద్యం పట్టివేత

May 6,2024 01:34 #MADYAM, #NTR
  •  రూ.30 లక్షల తెలంగాణా మద్యం పట్టివేత
  •  ఐదుగురు నిందితుల అరెస్టు
  •  నందిగామలో గోవా మద్యం హల్‌చల్‌ !

ప్రజాశక్తి – మైలవరం/ నందిగామ : ఎన్నికల వేళ భారీగా అక్రమ మద్యం రవాణా అవుతోంది. తెలంగాణా నుండి ఆంధ్రాలోకి వస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో భారీగా డంప్‌చేస్తున్న తెలంగాణా మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఎస్‌ఇబి) పోలీసులు పట్టుకున్నారు. సుమారు 400 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షల వరకూ ఉంటుందని అంచనా. మైలవరం మండలం అనంతరం, రెడ్డిగూడెం మండలం రంగాపురం పంచాయతీ శివారు రెడ్డికుంటలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని మైలవరంలోని ఎస్‌ఇబి కార్యాలయానికి తరలించారు. ఈసందర్భంగా ఎస్‌ఇబి అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సి.భార్గవ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం….మద్యం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఎస్‌ఇబికి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు మైలవరం మండలం అనంతరం గ్రామంలో ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు డంప్‌ చేసిన 150 మద్యం కేసులను ఎస్‌ఇబి ఎస్‌ఐలు, సిబ్బంది దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమచారం మేరకు రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామంలోని ఒక మామిడి తోటలో డంప్‌ చేసిన 250 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఒక అశోక్‌ లెల్యాండ్‌, షిఫ్ట్‌ డిజైర్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మద్యంతో సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. వీరంతా రెడ్డిగూడెం మండలానికి చెందినవారే. భారీఎత్తున మద్యాన్ని పట్టుకున్న ఎస్‌ఐలను, సిబ్బందిని ఎస్‌ఇబి సూపరింటెండెంట్‌ భార్గవ అభినందించారు. ఈ దాడుల్లో ఎస్‌ఇబి సిఐ ఐ.నాగవల్లి, ఎస్‌ఐలు రమాదేవి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిందితులంతా టిడిపికి చెందిన వారు కావడం గమనార్హం.

నందిగామలో గోవా మద్యం పంపిణీ
నందిగామలో విచ్చలవిడిగా గోవా మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే అడపాదడపా రాత్రి సమయాల్లో కార్యకర్తలకు ఈ మద్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. వైసిపి, టిడిపి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు సందర్భంగా జరిగిన ర్యాలీ అనంతరం ఈ మద్యం పంపిణీ జరిగినట్లు సమాచారం. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మద్యం పంపిణీ చేసేందుకు ఎక్కడిక్కడే నిల్వ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పంపిణీ అయిన ఈ మద్యం బాటిళ్లపై ”గోవాలో మాత్రమే ఈ మద్యం అమ్మకం జరపాలి” అంటూ ముద్రించి ఉంది. రాయల్‌ క్వీన్‌ పేరు కలిగిన ఈ మద్యం బాటిల్‌ ఎంఆర్‌పి ధర రూ.26 అని, 2020లో తయారీ అని కూడా బాటిళ్లపై ముద్రించి ఉంది.

➡️