ఉక్కు ప్రయివేటీకరణతో కార్మికులకు తీవ్ర నష్టం

May 5,2024 22:16 #Protest, #visaka steel plant

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటుపరమైతే కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కెఎస్‌ఎన్‌.రావు, రామకృష్ణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1179వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ వృద్ధిలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కీలకమన్నారు. కర్మాగారం ప్రయివేటుపరమైతే ముందుగా నష్టపోయేది కాంట్రాక్టు కార్మికులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తున్న మోడీ సర్కారుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి, జనసేన, వైసిపిలు మద్దతు తెలపడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామన్న ప్రకటన కేంద్రం నుంచి వచ్చేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉక్కు రక్షణకు పాటుపడే వారికే ఈసారి కార్మికుల మద్దతు ఉంటుందని తెలిపారు.

➡️