భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఆపండి : హైకోర్టు

Nov 30,2023 07:52 #AP High Court, #Mines, #sand
high court on sand mining

ప్రజాశక్తి-అమరావతి : ధవదేశ్వరం వద్ద గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తామిచ్చిన స్టే ఆదేశాల్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను ఉద్ధేశించి చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ హెచ్చరించింది. రాజమహేంద్రవరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ వంశీ దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదించారు. చట్ట వ్యతిరేకంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని చెప్పారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో భారీ యంత్రాలతో చేస్తున్న ఇసుక తవ్వకాలపై స్టే విధించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

బౌద్ధమత ఆనవాళ్లను గుర్తించాలి..

విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, తొట్లకొండలోని బౌద్ధక్షేత్రం పరిధిలో ప్రభుత్వం డీ నోటిఫై చేసిన భూమిని సర్వే చేయాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాను హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఆ భూముల్లో బౌద్ధమత నిర్మాణాలు, ఆనవాళ్లు ఉన్నాయో లేవో కూడా గుర్తించాలంది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. తొట్లకొండ బౌద్ధ క్షేత్రం పరిధిని తగ్గిస్తూ ప్రభుత్వం 2021లో జిఓ 131ను జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ పర్యావరణవేత్త ఎల్‌ రాణిశర్మ పిల్‌ దాఖలు చేశారు. చారిత్రక ప్రాముఖ్యత ఉన్న బౌద్ధ క్షేత్ర పరిధి తగ్గింపు చెల్లదని సీనియర్‌ న్యాయవాది కెఎస్‌ మూర్తి వాదించారు. దీంతో హైకోర్టు పైవిధంగా ఆదేశించి విచారణను వాయిదా వేసింది.

➡️