హోమ్‌ ఓటింగ్‌.. టిడిపి, వైసిపి శ్రేణులు ఘర్షణ

May 8,2024 21:56 #gunter, #TDP, #YCP

పల్నాడులో ఉద్రిక్తత
– హోమ్‌ ఓటింగ్‌ విషయంలో వివాదం
– పరస్పరం రాళ్లు రువ్వుకున్న టిడిపి, వైసిపి కార్యకర్తలు
ప్రజాశక్తి-ముప్పాళ్ల (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హోమ్‌ ఓటింగ్‌ విషయంలో వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదల గ్రామంలో 17 మంది హోమ్‌ ఓటింగ్‌కు నమోదు చేసుకోగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో టిడిపి మద్దతుదారు అయిన ఓ వృద్ధుని వద్ద ఓటు నమోదు చేయిస్తుండగా వైపిపి కార్యకర్తలు వెళ్లి ఓటు తమ పార్టీకే వేయాలని కోరారు. ఇంటి వద్దకే పింఛను ఇస్తున్నామని, ఓటేస్తే తమ పార్టీ మళ్లీ గెలిచాక ఇంకా సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న టిడిపి కార్యకర్తలు రావిపాటి నాగేశ్వరరావు, కందుల నరసింహారావు అభ్యంతరం తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టడం ఏమిటని అడ్డుకున్నారు. దీంతో వైసిపి నాయకులు కానాల పుల్లారెడ్డి మరికొంతమంది గొడవకు దిగడంతో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దాడుల్లో టిడిపికి చెందిన రావిపాటి నాగేశ్వరరావు, కందుల నరసింహారావు, వైసిపికి చెందిన కానాల పుల్లారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఇరు గ్రూపులను చెదరగొట్టారు. అనంతరం మిగతా ఓట్లను నమోదు చేయించారు. క్షతగాత్రులను సతైనపల్లి ఏరియా వైద్యశాల తరలించారు. ఘర్షణపై విచారణ చేస్తామని ఎస్‌ఐ హజరతయ్య తెలిపారు.
అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ పరస్పర ఆరోపణలు
క్షతగాత్రులను పార్టీల వారీగా వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, టిడిపి అభ్యర్థి కన్నా లకీëనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓటమి భయంతోనే వైసిపి కార్యకర్తలపై టిడిపి వారు దాడులు చేస్తున్నారని అన్నారు. టిడిపి సానుభూతి పరుడైన వృద్ధుడిని ఓటు అడగడానికి వెళ్లిన వారిపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, దాడులను ప్రోత్సహించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. కన్నా లకీëనారాయణ మాట్లాడుతూ అరాచకాలు సృష్టించి, ప్రజలను భయపెట్టి గెలవాలని వైసిపి యత్నిస్తోందని విమర్శించారు. వైసిపి దాడులకు భయపడబోమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక శక్తులను కట్టడి చేస్తామని అన్నారు.

➡️