రాష్ట్రంలో హంగ్‌ రావచ్చు

– ఇక్కడ కూడా షిండేలు
– సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌ వచ్చే అవకాశం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండరని, బిజెపి అనుకూల ప్రభుత్వానికి ద్వారపాలకులుగా ఉంటారని తెలిపారు. విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో శరద్‌పవార్‌కు చెందిన ఎన్‌సిపి, శివసేన వంటి పార్టీలను చీల్చి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో కూడా షిండేలు ఉన్నారని అన్నారు. ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఇండియా వేదిక పనిచేస్తుందన్నారు. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఇండియా వేదికను బలపర్చాలని కోరారు. ప్రస్తుత ఎన్నికల్లో కరపత్రాల కంటే ఎక్కువగా కరెన్సీ నోట్లు పంచుతున్నారని అన్నారు. ప్రపంచంలో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీకి జగన్‌ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఏకంగా మోడీకి భజన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో అపద్ధర్మ ప్రధాన మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి ఎన్నికల కమిషన్‌ తగిన సూచనలు చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌కు నారాయణ లేఖ రాశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, కెవివి ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️