ఛార్జిషీట్‌లో ఉన్నది మాట్లాడితే న్యాయ స్థానం ఆంక్షలెందుకు?

Apr 21,2024 21:59 #cpi narayana, #Viveka murder case
  •  సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిబిఐ ఛార్జిషీట్‌లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయ స్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని దాసరిభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేకా హత్య కేసు గురించి, సిఎం జగన్‌ కేసుల గురించి మాట్లాడవద్దని కడప కోర్టు ఆదేశించడం సరికాదన్నారు. సిబిఐ ఛార్జిషీట్‌లో ఫైల్‌ చేసిన అంశాలే పత్రికల్లో వస్తాయని, వాటిపైనే రాజకీయ పార్టీలు మాట్లాడకూడదని ఆంక్షలు పెడితే రాజకీయ పార్టీలు ఏం మాట్లాడాలని ఆయన సందేహం వెలిబుచ్చారు. ప్రధాని మోడీ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. దేశంలో అవినీతికి పాల్పడి విదేశాలకు పారిపోయిన అవినీతిపరుల్ని వెనక్కి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గుతున్నాయని అర్థంకావడంతో బిజెపి దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టిందన్నారు. తొలి విడతలో ఎన్నికలు జరిగిన తమిళనాడులో డిఎంకె, వామపక్షాలు విజయదుందుభి మోగించబోతున్నాయన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తే వైసిపి లాభపడుతుందని కొందరు వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బలపడ్డాయని, కమ్యూనిస్టుల ప్రభావం కనబడుతుందని అన్నారు. కేశినేని బ్రదర్స్‌లో ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీ బ్రదర్సేనన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్య నిషేధం చేసి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్‌.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు సభలు పెట్టుకోవాలంటే పోలీసులు అనుమతినివ్వడం లేదన్నారు. మీడియా సమవేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, కెవివి ప్రసాద్‌, ఎపి ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్‌, కోశాధికారి ఆర్‌ పిచ్చయ్య పాల్గొన్నారు.

➡️