మతం పేరుతో బిజెపి చిచ్చు

Apr 24,2024 22:19 #speech, #ys sharmila

వైఎస్‌ఆర్‌ను అవమానించిన ‘బత్స’ జగన్‌కు తండ్రి సమానులట!
– రేపల్లెలో ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
ప్రజాశక్తి-రేపల్లె, పెడన :బిజెపి మతతత్వ పార్టీ అని.. మతం పేరుతో చిచ్చు పెట్టి చలి కాచుకోవాలన్నదే ఆ పార్టీ మంత్రమని పిసిసి అధ్యక్షలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా రేపల్లె, కృష్ణా జిల్లా పెడన, పామర్రులో షర్మిల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అసెంబ్లీలో తాగుబోతు అని తిట్టిన బత్స సత్యనారాయణ ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డికి తండ్రి సమానులయ్యారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఉరిశిక్ష వేయాలని కూడా బత్స వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. విజయమ్మను సైతం అవమానించారని చెప్పారు. జగన్‌ కేబినెట్‌లో ఉన్నవాళ్లంతా వైఎస్‌ఆర్‌ను తిట్టిన వాళ్లేనని, ఇప్పుడు వాళ్లంతా సిఎం జగన్‌కు తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అయ్యారని, నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్లు ఏమీ కారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వారు, గొడ్డలి వేటుకు బలైన వారూ గుర్తు లేరని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్‌ ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా నేటికీ ప్రత్యేక హోదా సాధించలేకపోవడం పాలకుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. హోదాను సాధించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. ఇదే లక్ష్యంతో పనిచేస్తానని వివరించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పరిపాలనలో రైతులకు పలు సబ్సిడీ పథకాలు అందాయని, నేడు వ్యవసాయం చేయలేక అప్పుల ఊబిలో రైతులు కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బిజెపి లాంటి నియంతత్వ, మతతత్వ పార్టీ మరొక్కసారి అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో భారతదేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌.మణిలాల్‌, పెడన, పామర్రు కాంగ్రెస్‌ అభ్యర్థులు సొంటి నాగరాజు, డివై.దాస్‌, సిపిఎం కృష్ణాజిల్లా నాయకులు బూర సుబ్రహ్మణ్యం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️