దేశానికి ఇండియా వేదికే ప్రత్యామ్నాయం

-వైసిపి, టిడిపిలతో రాష్ట్రానికి హోదా రాదు
-మోడీతో జగన్‌, చంద్రబాబు ట్రయాంగిల్‌ లవ్‌
-న్యాయ్ యాత్ర సభల్లో వైఎస్‌.షర్మిల
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, శ్రీకాకుళం ప్రతినిధి, టెక్కలి :దేశానికి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి పనికిరాదని, ఇండియా వేదికనే సరైన ప్రత్యామ్నాయమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. మోడీతో చంద్రబాబు పొత్తు, జగన్‌ తొత్తు అని… వీరి ముగ్గురిదీ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో చంద్రబాబు ప్రత్యక్షంగా, జగన్‌ పరోక్షంగా జతకట్టి వారి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు, యువతకు ఉపాధి కల్పనకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఇండియా వేదికలోని కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోనూ, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోనూ ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. జగన్‌ గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవేవీ అమలు చేయలేదన్నారు. 42 నీటి పారుదల ప్రాజెక్టులను నవరత్నాల్లో పెట్టి ఏ ఒక్కటీ అమలు చేయలేదని వివరించారు. మద్యనిషేధం హామీని తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులని చెప్పి విశాఖలో కూడా రాజధాని పెట్టలేకపోయారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ విఫలమయ్యారన్నారు. గంగవరం పోర్టును ప్రభుత్వంలో కలిసేలా వైఎస్‌.రాజశేఖరరెడ్డి అగ్రిమెంట్‌ చేస్తే, అయన కొడుకైన జగన్‌… అదానీకి అమ్మేయడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి గంగవరం అదానీ పోర్టు కారణమన్నారు. విశాఖ ఎంపీగా 2019లో గెలిచిన వైసిపి వ్యక్తి భూకబ్జాలతో ఎంపీ పదవిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. విశాఖ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న సత్యారెడ్డిని తాజా ఎన్నికల్లో గెలిపిస్తే ఇక్కడి ప్రజల తరుఫున పార్లమెంట్‌లో గళం వినిపిస్తారని తెలిపారు. సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ షర్మిల న్యాయ యాత్రతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో జవసత్వాలు వచ్చాయన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ రాకపోయినా, స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో పడినా పాలకులకు పట్టడం లేదన్నారు. చంద్రబాబు, జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. విశాఖలో కాంగ్రెస్‌ విశాఖ ఎంపీ అభ్యర్థి పి.సత్యారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గన్నారు.
పాత హామీలే నెరవేర్చనప్పుడు కొత్త మేనిఫెస్టో ఎందుకు?
గత మేనిఫెస్టోనే జగన్‌ అమలు చేయలేకపోయారని, శనివారం మళ్లీ మ్యానిఫెస్టో విడుదల చేయడం ప్రజలను ఏమార్చడానికేనని షర్మిల విమర్శించారు. ఉక్కునగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసిపి మేనిఫెస్టో విడుదల సమయంలో జగన్‌ ప్రత్యేక హోదా విషయంపై ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. పోలవరం కోసం ఒక్క ఉద్యమం కూడా ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ప్రతి సంక్రాంతికీ జాబ్‌ కేలండర్‌ అని ప్రకటించి, ఐదు సంక్రాంతులు వెళ్లినా జాబ్‌ కేలండర్‌ ప్రకటించకుండా నిరుద్యోగ యువతను మోసగించారన్నారు. వైసిపి కార్యకర్తలను వలంటీర్లుగా పెట్టి ఏదో గొప్ప పని చేశామన్నట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నమ్మిన బంటు అని చెప్పుకుంటున్న పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి సిబిఐ కేసుల్లో రాజశేఖరరెడ్డి పేరును చేర్చాలని ఎందుకు కోర్టుల చుట్టూ తిరిగారని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి పేరు లేకపోతే జగన్‌మోహన్‌ రెడ్డి బయటపడరని ఆ పని చేశారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి బయటపడడం కోసం రాజశేఖరరెడ్డి పేరు చేర్చినందుకు బహుమతిగా పొన్నవోలుకు అసిస్టెంట్‌ అడ్వకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చారని ఆరోపించారు.

➡️