కేసుల మాఫీ కోసం ఎంపీల తాకట్టు

Feb 12,2024 17:22 #meeting, #Nara Lokesh, #srikakulam, #TDP
Jagan's effort is for remission of cases
  • ఏనాడైనా ప్రధానిని ప్రత్యేక హోదా అడిగారా?
  • జగన్‌కు లోకేష్‌ సూటి ప్రశ్న

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి ఎంపీలను తాకట్టు పెట్టారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. శంఖారావం యాత్రలో భాగంగా రెండో రోజు సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌… కేంద్రం ముందు మెడలు వంచారని దుయ్యబట్టారు. హోదా కోసం ఏనాడైనా ప్రధానిని అడిగారా? అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్నారని, జగన్‌ పేరు కూడా ఛార్జిషీట్‌లోకి రాబోతుందని అన్నారు. టిడిపి హయాంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.1,500 ఉంటే, ఇప్పుడు రూ.ఐదు వేలకు చేరిందని తెలిపారు. ఇసుక పేరుతో జగన్‌ గత ఐదేళ్లలో రూ.5,400 కోట్లు దోచేశారని ఆరోపించారు. టిడిపి, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ఇసుక ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సిపిఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా ఉద్యోగులను జగన్‌ మోసం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రను ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్‌ సుబ్బారెడ్డి పందికొక్కుల మాదిరిగా మెక్కేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక తిన్నదంతా కక్కిస్తామన్నారు. ఏ తప్పూ చేయకపోయినా చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై చర్చకు తాము సిద్ధమని, తేదీ, సమయం జగన్‌ చెప్పాలని సవాల్‌ విసిరారు.

రెండో రోజూ పలు వినతులు

రెండో రోజూ పలువురు లోకేష్‌ను కలిసి వినతిపత్రాలు అందించారు. సిపిఎస్‌తోపాటు మోసపూరిత జిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయాలని బార్‌ అసోసియేషన్‌ ఆధ్యర్యాన న్యాయవాదులు వినతిపత్రం ఇచ్చారు. ఇస్లాం బ్యాంకు ద్వారా మైనార్టీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు కోరారు. గోపాలమిత్ర పథకాన్ని పునరుద్ధరించి గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

➡️