గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలి

Mar 13,2024 23:53 #aidwa, #rama devi
  • ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్‌
  •  బాధిత మహిళలు, బాలికలందరికీ ఇదే తరహా సాయం అందించాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెనాలిలో ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్యాయత్నం చేసి రైలు యాక్సిండెంట్‌లో చనిపోయిన గీతాంజలికి ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, రమాదేవి సంతాపం ప్రకటించారు. సోషల్‌ మీడియాలో మాట్లాడిన గీతాంజలి ట్రోలింగ్‌కు గురై చనిపోయినట్లు వార్తలు వచ్చాయని, ఆమెను కావాలని మరణానికి గురిచేశారన్న వార్తలూ వచ్చాయని తెలిపారు. ఆమె మరణంపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ట్రోలింగ్‌ చేసిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే మహిళా సంఘాల నాయకులు, రాజకీయాల్లో పాల్గొంటున్న మహిళలు పెద్దయెత్తున ట్రోలింగ్‌కు గురవుతున్నారని తెలిపారు.
దానికి కారణమైన వారిపై కేసులు పెట్టడంగానీ, శిక్షించగడంగానీ జరగడం లేదని పేర్కొన్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని బూతులు తిడుతున్న దుష్టశక్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం, పునరావాసం కల్పించడాన్ని ఐద్వా తరపున స్వాగతించారు. అలాగే ఎంతోమంది దారుణ హత్యలకు గురై సాయం కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు. అరకు మండలంలో చొంపి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై గంజాయి మత్తులో ఉన్న యువకుడు అత్యాచారం చేశాడని, ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి సాయమూ లభించలేదని పేర్కొన్నారు. తెనాలిలో ఒక పాప తండ్రి చేతిలో హత్యాయత్నాన్ని ఎదుర్కొని బతికిందని అన్నారు. తల్లి, చెల్లిని చంపేశాడని, ఆ పాపకు కూడా సాయం అందలేదని వివరించారు. ప్రభుత్వం బాధిత మహిళల విషయంలో అన్ని సందర్భాల్లోనూ వేగంగా స్పందించి పునరావాసం సాయం చేయాలని కోరారు.

➡️