కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం : షర్మిల

కడప : కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం అని, కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలి అని షర్మిల కడప ప్రజలను కోరారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఎపిసిసి చీఫ్‌, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ …. ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ నెరవేరలేదని, 10 ఏళ్లుగా బిజెపి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. విభజన హామీలు వెరవేర్చని బిజెపి తో వైసిపి, టిడిపి లు ఎందుకు పొత్తులు, తొత్తులుగా మారారు ? అని ప్రశ్నించారు. అందరికీ రాజధానులు ఉన్నాయని.. మనకు చేతిలో చిప్ప ఉంది అని ఎద్దేవా చేశారు. నెత్తిమీద కుచ్చు టోపీ ఉంది అని అన్నారు. చంద్రబాబు సింగపూర్‌ అంటే .. జగన్‌ మూడు రాజధానులు అన్నారని విమర్శించారు. వాషింగ్‌ టన్‌ డిసి తలపించే రాజధాని అన్నారు… 10 ఏళ్ల తర్వాత గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. జగన్‌ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు. సంక్రాంతి కి జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు…వచ్చిందా ? మద్యపాన నిషేధం అన్నారు.. చేశారా ? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడాలేని బ్రాండ్‌ లు ఇక్కడే ఉన్నాయని.. వాళ్ళు ఏది అమ్మితే అదే తాగాలి అని అన్నారు. బూమ్‌ బూమ్‌ అంట..క్యాపిటల్‌ అంట..ప్రెసిడెంట్‌ మెడల్‌ అంట.. రాష్ట్రం మొత్తం మాఫీయామయం.. లిక్కర్‌ మాఫియా…సాండ్‌ మాఫీయా..భూ మాఫీయా.. హత్యా రాజకీయాలు తప్ప మరోటి లేదు అని మండిపడ్డారు. వివేకా ను గొడ్డలితో 7 సార్లు నరికారని, అలాంటి నిందితుడిని పక్కన పెట్టుకొని జగన్‌ తిరుగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ మారిపోయారని షర్మిలా అన్నారు. సిఎం అవ్వక ముందు వైఎస్‌ఆర్‌ మరణం వెనుక రిలయన్స్‌ హస్తం ఉందని చెప్పారనీ, సిఎం అయ్యాక వాళ్ళనే పిలిచి ఎంపీ పదవులు ఇచ్చారని నిప్పులు చెరిగారు. వివేకా మరణం తర్వాత సిబిఐ విచారణ అన్నారని.. సిఎం అయ్యాక సిబిఐ విచారణ అవసరం లేదు అని అన్నారని మాట మార్చారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ పేరును సీబీఐ ఛార్జ్‌ షీట్‌ లో చేర్చింది అని చెప్పారనీ, నిజానికి సిబిఐ ఛార్జ్‌ షీట్‌ లో చేర్పించింది జగన్‌ అని చెప్పారు. రాజకీయాల కోసం నాన్న పేరును ఛార్జ్‌ షీట్‌ లో పెట్టించారని షర్మిల దుమ్మెత్తిపోశారు. వైఎస్‌ఆర్‌ పేరు లేకుంటే బయటకు రాలేనని అనుకున్నారని, అందుకే పొన్నవోలు తో పెట్టించారని, అందుకు పొన్నవోలు సుధాకర్‌ కి అడ్వకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చారని తెలిపారు. ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుందన్నారు. కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా ? నేరాన్ని గెలిపిస్తారా ? అని షర్మిల అడిగారు. ” వైఎస్‌ఆర్‌ బిడ్డ గా మాట ఇస్తున్న-ఈ గడ్డ బిడ్డగా ఇక్కడే బతుకుతా – ఈ గడ్డ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తా ” అని షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ పాలన తిరిగి తెస్తామన్నారు. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం అని, కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలి అని షర్మిల కోరారు.

➡️