అంగరంగ వైభవంగా కోదండరాముని కల్యాణం

  • పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన టిటిడి ఇఒ ధర్మారెడ్డి

ప్రజాశక్తి- ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలో సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని కనురాల తిలకించేందుకు జిల్లా, రాష్ట్ర నలుమూల నుండి సందర్శకులు విచ్చేశారు. కడప రోడ్డులో విశాలమైన మైదానంలో పందెళ్లు వేసి పూలతో అలంకరించారు. విద్యుత్‌ కాంతులు, కోలాటాలు, దీపాలతో కూడిన కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. శ్రీ సీతారాముల స్వామివారిని ఆలయం నుండి ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. మా వంశం గొప్పదంటే, మా వంశమే గొప్పదని వేదపండితులు కొంతమంది సీతమ్మ వైపు, మరి కొందరు రామయ్య వైపు చేరి వేడుక చేశారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. జగదభిరాముని కల్యాణానికి టిటిడి ఇఒ ధర్మారెడ్డి దంపతులు బంగారు అభరణాలు, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టిటిడి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణ వేదిక వద్ద సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక సిఎస్‌లు కరికాలవల్లన్‌, ఎస్‌ఎస్‌.రావత్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ గిరిజ శంకర్‌, వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఉప లోకాయుక్త రజని, జిల్లా జడ్జి శ్రీదేవి, జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌, జెఇఒలు గౌతమి, వీరబ్రహ్మం, జిల్లా ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ తదితరులు పాల్గొన్నారు.

శివధనుర్భాలంకారంలో కోదండరాముడు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం శివధనుర్భాలంకారంలో రాముల వారు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన వృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తు చేసేది శివధనుఠరేగాలంకారం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌బాబు, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️