గంగపుత్రులకు న్యాయం చేయాలి : కెవిపిఎస్‌

Apr 16,2024 01:02 #fisherman, #KVPS

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : గంగవరం పోర్టు కోసం భూమిని ఇచ్చి ఉపాధి కోల్పోయిన గంగపుత్రులకు న్యాయం చేయాలని కెవిపిఎస్‌ డిమాండ్‌ చేసింది. న్యాయబద్ధమైన కోర్కెల కోసం 2002 నుంచి పోరాడుతున్న గంగపుత్రులకు మద్దతు తెలిపేందుకు సోమవారం విజయవాడలో కెవిపిఎస్‌ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ల, అండ్ర మల్యాద్రి మాట్లాడుతూ.. ఉద్యోగులకు వేతనాలు పెంచటంతోపాటు, ఇతర సమస్యల పరిష్కారం నిమిత్తం బాధితులు ఆందోళన చేస్తున్నా.. ఇంతవరకూ యాజమాన్యం స్పందించకపోవటం దురదృష్టకరమన్నారు. పోర్టు నిర్మాణ సమయంలో జరిగిన అగ్రిమెంటు ప్రకారం కొన్నేళ్ల తర్వాత గంగవరం పోర్టు తెలుగుజాతి సంపద కావాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రాష్ట్రానికి ఉన్న వాటాను అదానికి కట్టబెట్టడంతో సమస్య జఠిలమైందని చెప్పారు. ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ప్రస్తుత ప్రభుత్వ సమక్షంలో పోర్టు యాజమాన్యం ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కే పరిస్థితి ఉందన్నారు. పోర్టు యాజమాన్యం వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని, అలాగే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️