ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకుందాం

  •  దాచూరి ఆశయాలను కొనసాగిద్దాం : ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ప్రజాశక్తి-బాపట్ల : దాచూరి ఆశయాలను కొనసాగిస్తూ.. ప్రభుత్వ విద్యా విధానాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు అన్నారు. యుటిఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా బాపట్లలోని ఎంఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో స్మారకోపన్యాస సభ, రాష్ట్ర విద్యా సదస్సు గురువారం జరిగింది. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లక్ష్మణరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె.జోజయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు. తొలుత రామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. దాచూరి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని అన్నారు. జోజయ్య మాట్లాడుతూ రామిరెడ్డి అంకిత భావాన్ని, సమయస్ఫూర్తిని, త్యాగనిరతిని కొనియాడారు. దాచూరితో తమకున్న అనుభవాలను తెలియజేశారు. సంఘం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి కార్యకర్తలను గుర్తించడం, తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. వృత్తితోపాటు సమాజంతో కలిసి పనిచేయాలని, అందుకు పనిచేసే చోటే నివాసం ఉండి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా మనకు ఆదర్శనీయుడిగా ఉన్నారని తెలిపారు. నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రామిరెడ్డి పోరాట పటిమను గురించి ఎంవిఎస్‌.శర్మ తెలియజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️