విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో చేపట్టిన ‘సిపిఎం జన శంఖారావం’ రెండోరోజు పాదయాత్ర 29వ డివిజన్‌ నుండి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ … బిజెపి, వైసిపి లపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందంటూ విజయవాడ మేయర్‌ ఈరోజు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చెత్తపన్ను వేయడం, ఇంటి పన్నులను ప్రతీ సంవత్సరం పెంచడం, డ్రైనేజీలకు, ఇండ్లలో ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయో లెక్కపెట్టి వాటిపై పన్నులేయడం, నీళ్ల ఛార్జీలు పెంచడం, కరెంటు బిల్లులు పెంచడం, గ్యాస్‌ బండ రేట్లు పెంచడం.. ఇవేనా వారు చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. కనీసం విజయవాడలో ఇంతవరకు సరైన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి లేనందుకు విజయవాడ పాలకులు సిగ్గుపడాలన్నారు. ఉన్న బ్రిడ్జీలన్నీ సగంలో ఆగిపోయినవేనన్నారు. విజయవాడలో చదువుకున్న యువత పనిచేయడానికి ఒక్క సంస్థ ఉందా ? పరిశ్రమ ఉందా ? ఐటి రంగం ఉందా ? అని అడిగారు. అసలు రాజధాని ఉందా ? అని అన్నారు. మోడి, జగన్‌ కుమ్మక్కై అసలు రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ మోడికే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు జిందాబాద్‌ కొడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు పదేళ్లపాటు పన్నులు పెంచకుండా ఉన్నంతలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కొండలపైకి కూడా నీళ్లిచ్చారని అన్నారు. విజయవాడలో పాలకులు కోట్లు తినేవారు.. కులాల్ని రెచ్చగొట్టేవారే ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ తరపున పోరాడేవారు కావాలని.. అందుకే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుండి సిపిఎం ను గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రజల వాణిని అసెంబ్లీలో వినబడేలా చేయాలని కోరారు.

➡️